గూగుల్ విశాఖలో పెట్టనున్న అతి పెద్ద డేటా సెంటర్ పెట్టుబడిని కేంద్రం కూడా క్లియర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సుమారు రూ. 50,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 2 బిలియన్ డాలర్లు పునరుత్పాదక ఇంధన సోర్సెస్ పై ఖర్చు చేస్తారు. ఇది డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ అందిస్తుంది. ఈ డేటా సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా ఉంటుందని, సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో గూగుల్ డేటా సెంటర్ విస్తరణలో భాగంగా ఉంటుంది. ఇండియాలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేస్తుంది.
విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘డేటా సిటీ’కు కేంద్రం మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాపీరైట్ యాక్ట్‌లో సవరణలు ప్రతిపాదించింది. విశాఖలో గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. గతంలో ఎంవోయూ కూడా చేసుకున్నారు. అయితే ఏ విభాగంలో పెట్టుబడులు పెడతారన్నదానిపై స్పష్టత లేదు. తర్వాత అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌ను ఒక టెక్ హబ్‌గా మార్చడంలో భాగంగా, విశాఖపట్నంలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ ప్రకటించారు. విశాఖ అంతర్జాతీయ దిగ్గజం టెక్ కంపెనీలకు డెస్టినేషన్ గా మార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని డేటా సెంటర్లు కూడా పెట్టుబడుల చర్చలు జరుపుతున్నాయి. విశాఖలో ప్రత్యేకంగా డేటా సిటీ ఏర్పాటు చేస్తున్నారు.
డేటా సెంటర్లకు పెద్ద ఎత్తున నీరు అవసరం. అందుకే సముద్రం ఒడ్డున ఏర్పాటు చేస్తున్నారు. సముద్రం నీటితో డేటా సెంటర్ల నీటి అవసరాలు తీరిపోతాయి. ఆ నీటి వినియోగం ద్వారానే విద్యుత్ ను సమకూర్చుకుంటారు. ఎలా చూసినా.. ఈ పెట్టుబడులు రాష్ట్రానికి పెద్ద ఎత్తున టెక్ ఇమేజ్ తీసుకు రావడానికి ఉపయోగపడతాయి.