నేను రాజకీయాల్ని వదిలేశాను కానీ రాజకీయం నన్ను వదలడం లేదని ఓ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటోంది. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని గతంలో చిరంజీవి నేరుగా ప్రకటించారు. స్వయంగా ప్రధాని మోదీ రాజ్యసభకు నామినేట్ చేస్తామని ఆఫర్ ఇచ్చినా తిరస్కరించారన్న ప్రచారం ఉంది. జగన్ రెడ్డి కూడా రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. అయితే ఆయనను ఇతర రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ వాడు అనే చెప్పుకునేందుకు విచిత్రమైన రాజకీయ విన్యాసాలు చేస్తున్నాయి.
మూడు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కలిసిన అంశం వ్యక్తిగతం. ఆ తర్వాత ఆయన భేటీకి ముడిపెట్టి బీఆర్ఎస్ సానుభూతిపరులు, ఆ పార్టీ మీడియా… చిరంజీవిని జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేయాలని రేవంత్ కోరారాని ప్రచారం చేయడం ప్రారంభిచారు. దీనికి చిరంజీవి ఏ విషయం చెప్పలేదని కుటుంబసభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారంటున్నారు. కానీ చిరంజీవి గతంలో ఓ జాతీయ స్థాయి అవార్డుల ఫంక్షన్ లోనే నేరుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అడిగితేనే రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని చెప్పారు. ఒక వేళ రేవంత్ అలా అడిగి ఉంటే చెప్పకుండా ఉంటారా ?
అసలు రేవంత్, చిరంజీవి మధ్య రాజకీయాలపై చర్చే జరగలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవిని అనవసరంగా రాజకీయ చర్చల్లోకి తెచ్చి ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిరంజీవి కూడా స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. అనవసరంగా తనను రాజకీయ చర్చల్లోకి తెస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై తాను స్పందించబోనని.. తాను చేసే మంచే మాట్లాడుతుందన్నారు. తాను మంచి చేస్తూ.. మంచి చేసే తన సోదరులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
అయితే చిరంజీవికి ఉన్న గ్లామర్, పవన్ కల్యాణ్ రాజకీయ ఎదుగుదలను నియంత్రించాలనుకునేవారు మాత్రం చిరంజీవిని ఎప్పటికప్పుడు పొలిటికల్ టూల్ గా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు రేపుతూనే ఉన్నారు.