తుపాను కోస్తా ప్రాంతానికి దూసుకు వస్తోంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అలర్ట్ అయింది. ఎప్పుడు ఎంత వేగంగా తుపాన్ మీద పడుతుందో కానీ.. ఎంతో కొంత బీభత్సం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రజల జీవనాన్ని కూడా ప్రభావితం చేయనుంది. తుపాను వచ్చి వెళ్లిన తరవాత బాధితుల్ని ఆదుకోవడం కన్నా.. ముందుగానే వారికి సాయం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ తలా మూడు వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు బియ్యం, నిత్యావసర వస్తువులు ముందుగానే ఇవ్వనున్నారు. తుపాన్ తర్వాత ఏర్పడే పరిస్థితులు.. సాయం చేయడానికి ఏర్పడే అడ్డంకుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను తీవ్రత మంగళవారం నుంచి పెరుగుతుంది. బుధవారం తుపాను తీరం దాటే అవకాశం ఉంది.
తుపానును ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమయింది. ముందుగా ప్రాణనష్టం జరగకుండా.. తర్వాత ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. వీలైనంత తక్కువ నష్టంతో బయటపడేలా చూస్తున్నారు. వరద పరిస్థితిని బట్టి జలాశయాలను ఖాళీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా నిద్రపోకుండా.. తుపాను కదలికల్ని గమనిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.