అమెరికా-భారత్ మధ్య జరిగిన తాజా ట్రేడ్ డీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అయితే, ఈ తగ్గింపు వెనుక భారత్ కొన్ని కఠిన నిబంధనలకు అంగీకరించిందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించినప్పటికీ, భారత ప్రభుత్వం మాత్రం కేవలం పన్నుల తగ్గింపును మాత్రమే ప్రస్తావించి, మిగిలిన అంశాలపై గోప్యత పాటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ ఇకపై రష్యా నుంచి ముడి చమురు కొనకూడదని, దానికి బదులుగా అమెరికా లేదా వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలని షరతు విధించారు. అంతేకాకుండా, అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న పన్నులను సున్నా శాతానికి తగ్గించాలని, దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఇంధనం, సాంకేతికతను భారత్ కొనుగోలు చేయాలని ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ షరతులు భారత స్వయంప్రతిపత్తికి , స్థానిక రైతులకు నష్టం కలిగిస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా వస్తువులకు పన్నులు సున్నా చేస్తే భారతీయ పరిశ్రమలు దెబ్బతింటాయని, రష్యా చమురు ఆపేస్తే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆరోపిస్తోంది. ప్రజలకు ఈ డీల్ గురించి తెలిసే హక్కు ఉంది. మోదీ ప్రభుత్వం ఈ వివరాలను పార్లమెంటులో ఉంచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో, లోపల ఏదో తప్పు జరుగుతోందనే అనుమానం ప్రజల్లో కూడా మొదలవుతోంది. పూర్తి వివరాలు వెల్లడించి కేంద్రం .. ఈ ప్రచారానికి చెక్ పెట్టాల్సి ఉంది.