స్విమ్స్ వ్య‌వ‌హారంలో పుట్టా వివ‌ర‌ణ కోర‌నున్న ప్ర‌భుత్వం..!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క ‌మండలితోపాటు, రాష్ట్రంలోని ఇత‌ర దేవాల‌యాల పాల‌క ‌మండ‌ళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంద‌న్న క‌థ‌నాలు గ‌త‌వార‌మే వ‌చ్చాయి. ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడున్న పాల‌క మండ‌ళ్ల‌ను ర‌ద్దు చేస్తార‌నీ, కేబినెట్ లో తీర్మానం చేయ‌డం ఒక్క‌టే త‌రువాయి అన్న‌ట్టుగా లీకులు వ‌చ్చాయి. అయితే, ఆర్డినెన్స్ ద్వారా ఈ ప‌ని చేస్తే న్యాయ‌ప‌రంగా కొన్ని ఇబ్బందులు వ‌స్తాయ‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో తి.తి.దే. పాల‌క‌మండలి ఛైర్మ‌న్ వ్య‌వ‌హారం కొంత చ‌ర్చ‌నీయ‌మైంది. ప‌ద‌విని తాను వ‌దిలేదనీ, కావాలంటే బోర్డును ర‌ద్దు చేసుకోండి అనే త‌ర‌హాలో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఆ మ‌ధ్య స్పందించారు.

పాల‌క మండ‌లి నుంచి పుట్టాను స‌స్పెండ్ చేసేందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్టుగా ఇప్పుడు తెర‌మీదికి స‌మాచారం వ‌స్తోంది! స్విమ్స్ వ్య‌వ‌హారంలో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే అంశం ఇప్పుడు ప్ర‌ముఖం కానుంది. స్విమ్స్ లో కొన్ని వ్య‌వ‌హారాల్లో అవక‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ తి.తి.దే. ఒక నివేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ఛైర్మ‌న్ సుధాక‌ర్ యాద‌వ్ ను వివ‌ర‌ణ కోరేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. స్విమ్స్ కి సంబంధించిన కొన్ని ఉద్యోగాల నియాకాల విష‌యంలో ఆ సంస్థ డైరెక్ట‌ర్ పై సుధాక‌ర్ యాద‌వ్ ఒత్తిడి తెచ్చార‌నేది ఒక ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌గా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎగ్జిక్యుటివ్ క‌మిటీ తీర్మానాల‌కు విరుద్ధంగా ప‌నిచేయాలంటూ కూడా కొంద‌రికి ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ట‌!

ఇలాంటి కొన్ని ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సుధాక‌ర్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం. ఆయ‌న ఇచ్చే వివ‌ర‌ణ‌తో ప్ర‌భుత్వం సంతృప్తి చెంద‌క‌పోతే… ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పుట్టాను స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి! ఇదంతా పుట్టాని తొల‌గించ‌డం కోసం కొత్త ఎత్తుగ‌డ‌గా కొంత‌మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, స్విమ్స్ లో నిజంగానే అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే.. దానికి బాధ్య‌త వ‌హించాల్సింది ఆయ‌నే క‌దా అనేవారూ లేక‌పోలేదు. మొత్తానికి, ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పుట్టాను త‌ప్పించే అవ‌కాశాలే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో క‌నిపిస్తున్నాయి. ఈ వ్య‌హారంపై పుట్టా ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com