ఆ రెండు పత్రికలకూ చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం. ఎన్ని వార్తలు చెప్పినా, ఎంత సమాచారం అందించినా చంద్రబాబు ఇమేజ్‌ని ఆకాశానికెత్తేయడమే అసలు కార్యక్రమం. ఒకవేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాసినా, చంద్రబాబు ఏమీ చేయడం లేదేమో అన్న సందేహం ప్రజలకు వచ్చినా వెంటనే రంగంలోకి దిగిపోయి అద్భుతాలేవో జరిగిపోతున్నాయని ‘బొమ్మ’ చూపించే ప్రయత్నాలను భారీగా చేపడతాయి. అవి కూడా ఏ రేంజ్లో ఉంటాయంటే ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితులను మర్చిపోయి ఆ బొమ్మల కలల ప్రపంచంలో విహరించే స్థాయిలో ఉంటాయి. ఇక వైఎస్ కుటుంబాన్ని, సాక్షి పేపర్ని పూర్తి వ్యతిరేక బొమ్మలలో చూపించడం కూడా ఆ రెండు పత్రికల అసలు సిసలు కర్తవ్యం. చంద్రబాబు కుటుంబాన్ని ఆకాశానికెత్తేయడం, వైఎస్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కెయ్యడం…..ఆ రెండు పత్రికలు ప్రథమ కర్తవ్యం ఇదే.
ఇక ఈ రెండు పత్రికలకు పూర్తి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ప్రతిపక్ష పత్రిక కూడా. వైఎస్ రాజు, రాజాధిరాజు, హృదయాలేలిన చక్రవర్తి……అట్టే మాట్టాడితే దేవుని బిడ్డ…ఇంకా మాట్లాడితే దేవుడే….ఇదీ ఆ పత్రిక విధానం, సిద్ధాంతం. షరా మామూలుగా చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని ‘బంగాళాఖాతం’లోకి తొక్కేయాలన్న ఆశయం కూడా ఉంది.
తెలుగు మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషస్తున్న ఈ రెండు వర్గాలు కూడా చంద్రబాబు అధికారంలోకి రాకముందు వరకూ ప్రత్యక్ష యుద్ధమే చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోవడం, ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ‘రాతల’ విరమణ పాటిస్తున్నాయి. కానీ పరోక్ష యుద్ధాన్ని మాత్రం చేస్తున్నాయి. బిసిసిఐ పుణ్యమాని విశాఖపట్టణంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్ జరుగుతోంది ఏ స్టేడియంలో? డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసిఏ-వీడిసిఏ స్టేడియం అని ప్రతిపక్ష మీడియా నొక్కి చెప్తూ ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఆ స్టేడియం ఉంది అని హెడ్‌లైన్స్‌లో హైలైట్ అయ్యేలా చేస్తోంది. ఆ స్టేడియాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టించాడనో, ఆ స్టేడియం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యం అన్న అర్థమో రావాలన్నది ఆ మీడియా తాపత్రయం. ఇక ఆ రెండు పత్రికలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఏసిఏ-వీడిసిఏ స్టేడియం అని వార్తలు రాసేస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుని పూర్తిగా పక్కన పెట్టేశాయి. వైఎస్ అని రాస్తే వైఎస్ కుటుంబానికి ఎక్కడ ఏ ఒక్క ఓటు అన్నా పడుతుందేమో అని ఆ రెండు పత్రికల భయం.
ఈ ఒక్కటే అని కాదు. ఇంకా అనేక విషయాల్లో ఈ పరోక్ష యుద్ధాన్ని చేస్తున్నాయి ఆ రెండు మీడియా వర్గాలు. ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు అది కాస్తా ప్రత్యక్ష యుద్ధం అయిపోతుందనడంలో సందేహం లేదు. అత్యంత హా….శ్ఛర్యకరమైన విషయం ఏంటంటే తెలుగు ప్రజల శ్రేయస్సు కోసమే, మెరుగైన సమాజం కోసమే మేం ఉన్నామని చెప్పి ప్రజలను నమ్మించడంలో ఈ పొలిటికల్ పత్రికలన్నీ విజయవంతం అవుతూ ఉండడం…….