గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓ వైపు పార్టీ కేడర్ బలపడలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నగరంలో మాత్రం కారు కండిషన్లోకి రాలేదు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని నగర తెరాస నేతలు భావించారు. ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు.
నగరంలో తెరాస మొదటి నుంచీ వలస నేతలమీదే ఎక్కువగా ఆధారపడింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏరికోరి టీడీపీ నుంచి ఆహ్వానించి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన పార్టీకి ఏమేరకు బలమో తెరాస నాయకులు చెప్పలేక పోతున్నారు. సనత్ నగర్ కు ఉప ఎన్నిక జరిగితే ఖాయంగా గెలుస్తామని ధీమాగా చెప్పే తెరాస నాయకులు కొద్ది మందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల అదనంగా ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు జరిగితేనే ఏ సంగతీ తెలుస్తుంది.
మైనంపల్లి హన్మంత రావు వంటి ఒకరిద్దరు మాత్రమే కేడర్ లో ఉత్సాహం నింపగలరు. పార్టీకి వీలైనన్ని ఓట్లు రాబట్టే సత్తా వారికి ఉంది. కానీ గ్రేటర్ లో పాగా వేయాలంటే గట్టి కేడర్ కావాలి. దూకుడుగా ముందుకు వెళ్లే ద్వితీయ శ్రేణి నాయకత్వం కావాలి. అన్నిటికీ మించి, గెలుస్తామనే ఆత్మవిశ్వాసం ఉండాలి.
టీడీపీ, బీజేపీలకు ఇవన్నీ ఉన్నాయి. బలమైన కేడర్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. గెలుస్తామనే ధీమా కూడా చాలా మంది కార్యకర్తల్లో తొణికిసలాడుతోంది. ఈ రెండు పార్టీల వారూ గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి సత్తా చాటుగామని కసిగా కనిపిస్తున్నారు. ఇటీవలి పరిణామాలతో కేసీఆర్ ఆశ్చర్యపోయే ఫలితాలను సాధించి చూపిస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెప్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కు 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెరాస పోటీ చేయలేదు. మొత్తం 150 డివిజన్లలో కాంగ్రెస్ 52 గెల్చకుంది. టీడీపీ 45 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 43 డివిజన్లు గెల్చుకుంది. బీజేపీ 5 సీట్లకే పరిమితమైంది. ఇతరులు మిగతా 5 డివిజన్లలో గెలిచారు. ఇక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తెరాస సొంతగా మూడు సీట్లు గెలిచింది. 7 సీట్లు ఎంఐఎం కంటే టీడీపీ ఒక సీటు ఎక్కువే గెలిచింది. అలాగే, టీడీపీ, బీజేపీలు సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఎంపీ సీట్లను గెల్చుకున్నాయి. మైనంపల్లి హన్మంత రావు మల్కాజ్ గిరి లో గట్టి పోటీ ఇచ్చినా గెలవలేక పోయారు.
తెరాస గెల్చుకున్న మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనూ మెజారిటీ డివిజన్లను గెలుస్తుందని చెప్పే పరిస్థితి. ఆఖరి రౌండ్ ఓట్ల లెక్కింపు వరకూ తెరాస వెనకబడి ఉంది. అల్వాల్ డివిజన్ లెక్కింపుతో స్వల్ప తేడాతో విజయం సాధించింది. మిగతా డివిజన్లలో బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం సాధించారు. అదే ఫలితం పునరవావృతమైతే, తెరాసకు అల్వాల్ మినహా మిగతా డివిజన్లు దక్కడం కష్టమే. కనీసం మిగిలిన ఐదు నెలల్లో అయినా కేడర్ ను బలోపేతం చేసుకుంటే పరిస్థితిని మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది.