హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడి ప్రభుత్వం మొదటినుంచీ తెలంగాణకు వ్యతిరేకమేనని ఆరోపించారు. గోదావరి పుష్కరాలకుగానూ తెలంగాణకంటే ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపులు ఎక్కువ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు అన్యాయంపై పార్లమెంట్‌లో నిలదీస్తామని చెప్పారు. తాము మోడి ప్రభుత్వానికి వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని, తటస్థంగా ఉంటామని అన్నారు. మోడి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ వంటి ఆమోదయోగ్యమైన కార్యక్రమాలేమైనా చేపడితే తామూ వాటిని అమలు చేస్తామని ఉద్ఘాటించారు. బేగంపేట విమానాశ్రయాన్ని సైన్యానికి అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం వెనకకు తగ్గకుంటే కోర్టుకు వెళ్తామని అన్నారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు న్యాయం జరగదని చెప్పారు.