పర్యావరణ పరిరక్షణతో పాటు ఖర్చులను తగ్గించుకోవాలనుకునే గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా లెడ్ వంటి సంస్థల నుంచి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందిన అపార్ట్మెంట్లు, విల్లాలకు గృహ రుణాల వడ్డీ రేట్లలో బ్యాంకులు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయి. సాధారణ గృహ రుణాలతో పోలిస్తే, గ్రీన్ హౌసింగ్ లోన్లపై దాదాపు 0.10% నుండి 0.25% వరకు వడ్డీ తగ్గింపు లభిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఈ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి.
పర్యావరణ హితమైన ఇళ్లను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కేవలం వడ్డీ రేట్లనే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజులో కూడా రాయితీలు ఇస్తున్నాయి. ఉదాహరణకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులు గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణాలను మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా, ఈ గ్రీన్ హోమ్స్ వల్ల భవిష్యత్తులో విద్యుత్ , నీటి బిల్లులు 30% నుంచి 40% వరకు తగ్గే అవకాశం ఉండటంతో, రుణగ్రహీతల తిరిగి చెల్లింపు సామర్థ్యం పెరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనివల్ల లోన్ అప్రూవల్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ వంటి మహానగరాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. సౌర శక్తి వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సహజమైన గాలి-వెలుతురు వచ్చేలా రూపొందించే ఈ ఇళ్లకు గ్రీన్ సర్టిఫికేషన్ లభిస్తుంది. ఇల్లు కొనేటప్పుడు ఈ సర్టిఫికేట్ ఉందో లేదో సరిచూసుకుంటే, పర్యావరణానికి మేలు చేయడంతో పాటు లక్షలాది రూపాయల వడ్డీని ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
