గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు పూర్తి కావడంతో విజేతల గురించి స్ఫూర్తిదాయక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ నిరుపేద కూలి, మరో పంక్చర్ షాపు బిడ్డ, మరో చిరు వ్యాపారి ఆశల వారధి.. ఇలా ఎంతో మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. సరైన జీవన ప్రమాణాలు లేని మధ్యతరగతి కుటుంబాల నుంచి కొంత మంది ఉద్యోగాలు సాధించారు. వీరి విజయాల గురించి వింటూంటే చాలా మందికి స్ఫూర్తి కలుగుతోంది. కానీ వీరి ఉద్యోగాలు రాకుండా జరిగిన కుట్రలు గుర్తుకు వస్తే మాత్రం … రాజకీయాలపై కోపం వస్తుంది.
గ్రూప్ వన్ ఫలితాలపై జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. చిన్న చిన్న లోపాలను చూపించి హైకోర్టు నుంచి రీ వాల్యూయేషన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఇదే సందు అనుకుని రాజకీయ నేతలు రెచ్చిపోయారు. ఉద్యోగాలను మూడు కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ ఉద్యోగార్థుల కష్టం ఊరకే పోలేదు.. డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టి మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించింది. తుది తీర్పు ప్రకారం నియామకాల చెల్లుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.
350కిపైగా ఉన్న విజేతల్లో ఎవరిపైనా.. వారి స్థాయికి తగ్గ ఉద్యోగం కాదు.. వారికి చదువుల్లో అంత సీన్ లేదు..కానీ ఉద్యోగం వచ్చింది అన్న ఆరోపణలు రాలేదు. రాజకీయ పార్టీలు కూడా జాబితా వచ్చిన తర్వాత ఆరోపణలు చేయలేకపోతున్నాయి. నిజంగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుని ఉంటే.. ఈ రోజు ఉద్యోగాలు సాధించిన దిగువ, మధ్యతరగతి కుటుంబాలు ఆశలు కల్లలు అయిపోయేవి. ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. తాము కొన్ని వందల మంది జీవితాల్ని రాజకీయం కోసం నాశనం చేయడానికి వెనుకాడలేదని బాధపడాలి. నిరుద్యోగులతో రాజకీయాలు చేయడం మంచిది కాదని తెలుసుకోవాలి.