జీఎస్టీ రేషనలైజేషన్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. అన్ని రంగాల్లోనూ ఇంత ధరలు తగ్గాయని ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఆ ప్రచారం కనిపించడం లేదు. జీఎస్టీ లాభాన్ని మీకు బదిలీ చేస్తామని ఒక్క సంస్థ కూడా ప్రకటించడం లేదు. దీనికి కారణం రెడీ టు మూవ్ ఇళ్ల బిల్డర్లు ఇప్పటికే అన్ని వస్తువులపై జీఎస్టీని కట్టేశారు. అందుకే వారు తగ్గించలేరు.
జీఎస్టీ తగ్గింపు వల్ల కార్ల మార్కెట్ ఒక్క సారిగా జూమ్ అన్నది … ఒక్క రోజే మారుతి 30 వేలు, హ్యుందాయ్ 11 వేలు, టాటా 10వేల కార్లను డెలివరీ చేశాయి. నిజానికి జీఎస్టీ తగ్గింపులు ఉంటాయని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రకటించిన తర్వాత అమ్మకాలు దాదాపుగా ఆగిపోయాయి. అందరూ జీఎస్టీ తగ్గింపుల కోసం ఎదురు చూసి ఒక్కసారిగా కొనడం వల్ల ఈ డిమాండ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ కు ఈ డిమాండ్ లేదు. ఎందుకంటే ఆ రంగానికి నికరంగా సిమెంట్ విషయంలో మాత్రమే మినహాయింపు లభించింది.
ఇతర వస్తువులపై మినహాయింపు ఉన్నా.. నిర్మాణ ఖర్చులో పెద్దగా తేడా రాదు. భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు భారీగా ఉన్నప్పుడు.. వీటి ఖర్చు దిగిరావడం సాధ్యం కాదు. అయితే నాలుగైదు శాతం వరకూ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి నిర్మాణాలు చేసే బిల్డర్లు మాత్రమే వీటిని ఇవ్వగలరు. అందుకే.. ఆటోమోబైల్ సెక్టార్ కు వచ్చినంత ఊపు రియల్ ఎస్టేట్ కు రావడంలేదు. కానీ ఈ తగ్గింపు రియల్ ఎస్టేట్కూ మేలు చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.