హైదరాబాద్లో ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. రెండింటిలోనూ తుపాకులతో కాల్చి చంపారు. రెండింటికి సంబంధం లేదు కానీ.. హత్యకు తుపాకుల్నే ఆయుధాలుగా వాడుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ యువ నేత అనిల్ ను దుండగులు కాల్చి చంపేశారు. తన స్వగ్రామానికి వెళ్తూడంగా దారిలో అడ్డగించి ఆపి.. కాల్చి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు.
కానీ బాడీలో నాలుగు బుల్లెట్లు ఉండటంతో హత్య అని గుర్తించారు. అనిల్ భూ సెటిల్మెంట్లలో తలదూల్చారు. ఓ ల్యాండ్ విషయంలో సెటిల్మెంట్ కు ప్రయత్నించి ఓ పార్టీ దగ్గర బెంజ్ కారు కూడా తీసుకొచ్చారన్న ప్రచారం ఉంది. అనిల్ వాడుతున్న కారు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిది. ఈ వివాదంలోనే అనిల్ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే చంపడానికి గన్స్ వాడటమే పోలీసుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.
మరో వైపు మలక్ పేట ప్రాంతంలో సీపీఐ నేత చందు నాయక్ ను దుండగులు కాల్చి చంపేశారు. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో కారం చల్లి నాలుగు రౌండ్స్ కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో బుల్లెట్ గాయాలై.. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ స్పాట్ లోనే మృతిచెందాడు. మృతుడు చందు నాయక్ CPI రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చెందిన వామపక్ష నాయకుడిగా గుర్తింపు సాధించారు. ఈ హత్యకు కూడా ఓ భూవివాదమే కారణం అని భావిస్తున్నారు. నలుగురు నిందితులు .. పోలీసుల ఎదుట లొంగిపోయారు.
హత్యలకు అత్యంత సులువుగా గన్స్ వాడటం పోలీసు వర్గాల్ని సైతం విస్మయ పరుస్తోంది. ఈ ట్రెండ్ పెరిగితే.. పెద్ద ఎత్తున నేరాలకు అవకాశం ఏర్పడుతుంది.