ఒకప్పుడు పెద్ద హీరోల కళ్లన్నీ గుణశేఖర్పైనే ఉండేవి. క్రియేటివిటీని కమర్షియాలిటీని మిక్స్ చేసి సూపర్ హిట్లు కొట్టినదర్శకుడు ఆయన. అందుకే ఆయన సినిమాలకు అంత క్రేజ్. కానీ ఒక్కసారిగా గుణశేఖర్ ఇమేజ్ కుప్పకూలిపోయింది. ‘వరుడు’, ‘నిప్పు’, ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ ఇలా ఒకదాన్ని మించి మరో సినిమా ఫ్లాప్ అయ్యేసరికి తేరుకోలేకపోయారు. ‘హిరణ్య కశ్యప’ అనే భారీ ప్రాజెక్ట్ ప్రకటించి, దాని మీద మూడేళ్లు వర్క్ చేసి, చివరికి పక్కన పెట్టేయాల్సివచ్చింది. ఇప్పుడు ‘యుఫోరియా’ అనే ప్రాజెక్ట్ సెట్ చేసుకొని, ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో స్టార్లు లేరు. భారీ హంగామా లేదు. కొత్త వాళ్లతో చేసిన ప్రయత్నం ఇది. మళ్లీ మరో హిట్టు కొట్టి, పెద్ద హీరోల దృష్టిలో పడాలన్నది ఆయన ఉద్దేశం. గుణశేఖర్ కూడా రియాలిటీలోనే ఉన్నారు. హిట్లు లేకపోతే, ఎవరూ ఎవర్నీ పట్టించుకోరని, ఆ అవసరం కూడా లేదని ఆయనకు తెలుసు. ఆయన మాటల్లో కూడా అదే బలంగా వినిపిస్తోంది.
”నాకు హిట్లు లేవు. కాబట్టి నన్ను ఎవరూ లెక్కలోకి తీసుకోరు. ఇది రియాలిటీ. దాన్ని నేను గట్టిగా నమ్ముతా. నా కథలు వినడానికి, నాతో సినిమాలు చేయడానికి ఎవరూ రెడీగా ఉండరు. దాన్ని పాజిటీవ్ కోణంలోనే చూడాలి. ఎవరి దగ్గరో నిరూపించుకోవడం కోసం కాదు. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఓ హిట్టు కావాలి. అందుకే ‘యుఫోరియా’ చేశా” అని చెప్పుకొచ్చారు గుణశేఖర్. ఈ సినిమాపై దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశారాయన. స్టార్లు లేని సినిమాపై ఇంత పెట్టుబడి పెట్టడం నిజంగానే సాహసం. కానీ సినిమా జనంలోకి వెళ్తే.. కచ్చితంగా అవుట్ పుట్ బాగుంటుందని ఆయన నమ్ముతున్నారు. గుణశేఖర్ లాంటి దర్శకుడికి ఓ హిట్టు చాలా అవసరం కూడా. ఆయన హిట్టు కొడితే.. మరిన్ని కొత్త కథలు పట్టాలెక్కుతాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ `’హిరణ్య కశ్యప’ కూడా లైన్ లోకి వస్తుంది.
