గుంటూరు నగరంలో ఇళ్లు , అపార్ట్మెంట్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ధరల పెరుగుదల పెద్ద సవాలుగా మారింది. అయితే, నగర విస్తరణ , కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల లలో కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ తక్కువ ధరకే అపార్ట్మెంట్లు లభిస్తున్నాయి. గుంటూరు నగర శివారు ప్రాంతాలైన నల్లపాడు , తురకపాలెం ప్రస్తుతం తక్కువ ధరలో అపార్ట్మెంట్లు కోరుకునే వారికి ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. నగర ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ భూమి ధరలు తక్కువగా ఉండటంతో, బిల్డర్లు 2 BHK ఫ్లాట్లను రూ. 23 లక్షల నుండి రూ. 25 లక్షల ప్రారంభ ధరకే అందిస్తున్నారు. ముఖ్యంగా శాంతి నగర్, నల్లపాడు రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొత్త ప్రాజెక్టులు వేగంగా పుంజుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్లో సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఈ ప్రాంతం ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
విజయవాడ-చెన్నై జాతీయ రహదారికి సమీపంలో ఉన్న చౌడవరం , యానమదల ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 2 BHK ఫ్లాట్లు సుమారు రూ. 30 లక్షల నుండి రూ. 33 లక్షల మధ్య లభిస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు , పరిశ్రమలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల అద్దెల రూపంలో కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రభావంతో రాబోయే రోజుల్లో ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, పెట్టుబడి కోణంలోనూ ఇవి లాభదాయకమైన ప్రాంతాలుగా మారుతున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ. 30 లక్షల బడ్జెట్లో అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, నగరానికి తూర్పు వైపున ఉన్న బుడంపాడు, ఏటుకూరు రోడ్డు ప్రాంతాల్లో కూడా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర ప్రధాన నగరం కంటే దాదాపు 30 శాతం తక్కువగా ఉండటం విశేషం. లాజిస్టిక్ హబ్‌లు, ఐటీ పార్కులు సమీపంలోకి రానుండటంతో మధ్యతరగతి ప్రజలు ఈ ఏరియాల వైపు మొగ్గు చూపుతున్నారు.
పాలకలూరు రోడ్డు మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసరాలు:
ఒకప్పుడు శివారు ప్రాంతాలుగా ఉన్న పలకలూరు రోడ్డు, నల్లచెరువు వంటి ఏరియాల్లో ఇప్పుడు మధ్యస్థ బడ్జెట్ రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షలు ధరల్లో అపార్ట్మెంట్లు వస్తున్నాయి. నగరానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటూనే, బ్రోడిపేట, అరుండల్ పేట వంటి ఖరీదైన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఈ ప్రాంతాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
