బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు రెండేళ్లుగా పెద్దగా ఎవరికీ కనిపించడం లేదు. కానీ హఠాత్తుగా విశాఖలో ప్రత్యక్షమయ్యారు. గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం ఎంపీ సీటు కోసం జీవీఎల్ నరసింహారావు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విశాఖే నా గడ్డ అంటూ అప్పట్లో హల్చల్ చేసిన ఆయనకు, తీరా పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కకపోవడంతో కొన్నాళ్లపాటు సీన్ నుండి మాయమైపోయారు. కనీసం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో కూడా పెద్దగా కనిపించని ఈ ఢిల్లీ నేత, ఇప్పుడు మళ్లీ సంక్రాంతి సంబరాల పేరుతో విశాఖలో వాలడం స్థానిక నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సొంత ఊరు కాకపోయినా, విశాఖపై ఆయన చూపిస్తున్న ఈ ప్రేమ వెనుక విశాఖ సీటుపై ఆశలు వదులుకోలేదన్న విషయాన్ని నిరూపిస్తోంది. కూటమి సంప్రదాయం పేరుతో తాను నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు స్థానిక కూటమి నేతలను ఆహ్వానిస్తూ అందరినీ మొహమాట పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి నేతలు కాదనలేక, అలాగని ఆయనతో కలిసి తిరగలేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గతంలో పట్టించుకోని వారు సైతం ఇప్పుడు జీవీఎల్ హడావుడి చూసి ఆయనకు ఎందుకింత ఆశ అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నట్లుగా.. తనను రేసు నుంచి తప్పించాలంటే.. కనీసం రాజ్యసభ అయినా ఇవ్వాలన్నట్లుగా ఆయన రాజకీయం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం వద్ద తాను పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా ఈ హడావుడి ఉపయోగపడుతుంది. అయితే సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారు. ఎప్పటికి వస్తారో.. మళ్లీ సంక్రాంతికే కనిపిస్తారేమో?
