తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగో లేదని .. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక మంత్రి హరీష్ రావు ఖండించారు. కేంద్రంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గా ఉందని గణాంకాలతో సహా వివరణ ఇచ్చారు. ఆర్థిక పరమైన విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికిప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టిన హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విరుచుకుపడ్డారు. అభివృద్ధి రేటు లెక్కలు చెబుతూ బీజేపీ ప్రభత్వ వైఫల్యాలను వివరించారు. ఆరేళ్లుగా తెలంగాణ ఏటా 11.7 శాతం వృద్ధి నమోదు చేస్తోందని .. అదే సమయంలో భారత దేశ వృద్ధి రేటు కేవలం 8.1 శాతమే ఉందని గుర్తు చేశారు.
బీజేపీ పాలన వల్ల బంగ్లాదేశ్‌తో కూడా పోటీ పడలేని పరిస్థితి ఉందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 2014-15 నుంచి అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తగ్గుతూ వస్తూండగా బంగ్లాదేశ్ వృద్ధిరేటు పెరుగుతూ పోయిందని గుర్తు చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే బంగ్లాదేశ్ కన్నా తక్కువ స్థాయికి వృద్ధి రేటు తీసుకుపోవడమని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై హరీష్ రావు మండిపడ్డారు. తలసరి ఆదాయం, జీడీపీ ఈ రెండింటిని పరిశీలించినా తెలంగాణ ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం వెనుకబడి ఉందని స్పష్టంచేసారు. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 గా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
అప్పులు విపరీతంగా చేశారన్న విమర్శలపైా హ రీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జీఎస్డీపీలో 25 శాతానికి అప్పులు మించకూడదనే కేంద్రం విధించిన నిబంధన ఉందని తెలంగాణ తీసుకున్న అప్పులు జీఎస్డీపీలో 22.83 శాతంగా మాత్రమే ఉందని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాలు దాన్ని దాటిపోయాన్నారు. తాము తీసుకున్న అప్పులను సద్వినియోగం చేసుకున్నామని ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెట్టడం వల్లే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, పన్నుల ఆదాయం పెరుగుదలకు కారణమైందన్నారు. ఈ లెక్కలన్నీ చెప్పిన హరీష్ రావు ఎవరి పని తీరు బాగుందో చెప్పాలనికిషన్ రెడ్డికి సవాల్ చేశారు.
తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ రెండో స్థానం కోసమే కొట్లాడాలని, మొదటి స్థానానికి రాలేరని హరీష్ రావు తేల్చి చెప్పారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీనే ప్రథమ స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్, బీజేపీ కొట్టుకోవడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.