కవిత తనపై చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందించారు. కుమార్తెను లండన్ కాలేజీలో చేర్పించి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. నా పై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రకటించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసని.. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. పార్టీపై, నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ రావు.. కవితపై ప్రత్యారోపణలు చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే హరీష్ రావు రాజకీయాల గురించి, ఆయన అమలు చేసే రాజకీయ వ్యూహాలపై అందరికీ స్పష్టత ఉంది. కేసీఆర్ కుమార్తె తనపై అపనమ్మకం కలిగేలా ఆరోపణలు చేశారని ఆయన ఆవేశపడరు. దానికి తగ్గట్లుగానే స్పందించారు. లండన్ నుంచి వచ్చిన ఆయన కేసీఆర్ తో సమావేశం అవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఫామ్ హౌస్ నుంచి పిలుపువస్తేనే ఆయన వెళ్లే అవకాశం ఉంది.
కాళేశ్వరం రిపోర్టుపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినప్పుడు హరీష్ రావు దాదాపుగా రోజూ ఫామ్ హౌస్ కు వెళ్లేవారు. అసెంబ్లీకి తాను రాకూడదని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో .. హరీష్ రావు ఆ బాధ్యత తీసుకున్నారు. అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడరని బీఆర్ఎస్ పార్టీ అధికారిక మీడియాలో ప్రకటించారు. సోషల్ మీడియాలో ప్రశంసించారు. కేటీఆర్ కూడా ప్రశంసించారు. కానీ ఆ తర్వాత హరీష్ రావు గురించి చాలా విషయాలను కవిత టీం సోషల్ మీడియాలో బయటపెడుతోంది. ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.
ఎలా చూసినా హరీష్ రావు ఇప్పుడు పార్టీలో కొన్ని క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై ఇప్పుడు అనుమానపు చూపులు ఉంటాయి. కుమార్తెను వదులుకున్న కేసీఆర్.. హరీష్ రావును గతంలా ప్రోత్సహిస్తారా అన్నది కూడా చాలా మందికి వస్తున్న సందేహం . బీఆర్ఎస్లో జరగనున్న పరిణామాలు రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.