పవన్ కల్యాణ్‌కి రీమేక్ సినిమాలు బాగా అచ్చొచ్చాయి. ఓ దశలో వరుస పెట్టి అవే చేసుకొంటూ వెళ్లారు. కానీ ఫ్యాన్స్ మాత్రం పవన్ ని కొత్త కథల్లో చూడాలని ఆరాటపడుతున్నారు. `ఓజీ` రీమేక్ కాదు. దానికి తగ్గట్టుగానే మంచి ఫలితం వచ్చింది. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై మాత్రం ఓ డౌటు ఉంది. ఇది `తేరి` రీమేక్ అనే గుసగుసలు గట్టిగా వినిపించాయి. వాటిపై హరీష్ ఓసారి క్లారిటీ ఇచ్చాడు. కానీ రీమేక్ ముద్ర మాత్రం వీడిపోలేదు. ఈసారి ‘ఉస్తాద్’ రీమేక్ అనేవారికి హరీష్ గట్టిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
‘గబ్బర్ సింగ్’ లోని అంత్యాక్షరి ఎపిసోడ్ ని స్ఫూర్తిగా తీసుకొని, తేరిలో ఓ కామెడీ ట్రాక్ చేశారని, అలాంటప్పుడు ఆ సినిమాని తానెందుకు రీమేక్ చేస్తానని ప్రశ్నిస్తున్నాడు హరీష్. ఒకవేళ రీమేక్ చేస్తే ఆ విషయం చెప్పే చేస్తానని, ఈ విషయంలో మొహమాటం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇది పూర్తిగా కొత్త కథ అని స్పష్టం చేశాడు. హరీష్ తీసిన ‘గబ్బర్ సింగ్’, ‘గద్దల కొండ గణేష్’, ‘మిస్టర్ బచ్చన్’ ఇవన్నీ రీమేకులే. రీమేక్ కథ ఎంచుకొన్నా తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు చేర్పులు చేసి, హీరో ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని తనదైన మార్క్ వేస్తుంటాడు హరీష్. అయితే ఈసారి సొంత కథ కాబట్టి.. తన ముద్ర ఇంకాస్త బలంగా వేసే అవకాశం ఉంది.
‘ఉస్తాద్’ తరవాత హరీష్ సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. సితార నాగవంశీ హరీష్ కి ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చారు. బాలకృష్ణ కోసం హరీష్ ఓ కథ రాస్తున్నారని, అది సితారలో ఉండొచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
