హ‌రీష్ స్పీచ్‌… హెడ్ వెయిట్‌కి ప‌రాకాష్ట కాదా??

ఏమాట‌కామాట చెప్పుకోవాలి. డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్) సినిమా కంటే,… డీజే థ్యాంక్స్ మీట్‌లో.. హ‌రీష్ శంక‌ర్ స్పీచే బాగుంది. 15 నిమిషాల నాన్ స్టాప్ లో పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు హ‌రీష్‌. ఇన్ని తెలివితేట‌లు ఉన్న‌వాడు… ఇంత మేధావి.. ఆ తెలివి తేట‌ల్ని సినిమా తీయ‌డంలో ఎందుకు చూపించ‌డో అర్థం కాదు. డీజే – సూప‌ర్ హిట్టేం కాదు. క‌నీసం హిట్టు కూడా కాదు. ఏవో మూడు రోజుల వ‌సూళ్లు చూసుకొని చంక‌లు గుద్దేసుకొంటోంది టీమ్‌. అంతేనా… నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ మావే అంటున్నాడు హ‌రీష్‌. ‘మా సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చింది’ అంటూ హ‌రీష్ శంక‌రే సెల‌విచ్చాడు. రివ్యూల‌న్నీ… ఏకి ప‌డేశాయ‌న్న సంగ‌తి హ‌రీష్ మాట‌ల్ని బ‌ట్టి అర్థం అవుతోంది. అయినా.. ‘వ‌సూళ్లు చూడండి.. సినిమాలోని మంచి చెడులు కాదు’ అన్న‌ట్టు మాట్లాడ‌డంలో మ‌ర్మం ఏమిటో అర్థం కాదు. ‘నేను చాలా మాట్లాడాలి… చాలా ఎక్కువ మాట్లాడాలి’ అంటూ మైకు ప‌ట్టుకొన్న‌ప్పుడే హింట్ ఇచ్చిన హ‌రీష్‌.. నిజంగానే చాలా ఎక్కువ మాట్లాడేశాడు. హ‌రీష్ స్పీచ్‌.. చూస్తే.. ‘హ‌రీష్ కి హెడ్ వెయిట్ ఇంకా త‌గ్గ‌లేదు..’ అనిపించ‌డం ఖాయం. దానికి త‌గ్గ‌ట్టు త‌న ఎటిట్యూడ్‌ని కూడా చూపించుకొన్నాడు హ‌రీష్‌. ‘నేను రాసిన మాసాలా డైలాగులకే ఎక్కువ ప‌బ్లిసిటీ ఇచ్చింది… మంచి డైలాగుల్ని మ‌ర్చిపోయారు’ అన్న‌ది హ‌రీష్ బాధ‌. ‘డీజే’లో అలాంటివి కూడా ఉన్నాయా?? ఒక‌వేళ ఉన్నా అవేమైనా కొత్త డైలాగులా?? ‘టెక్నాల‌జీ వ‌చ్చి మ‌నుషుల మ‌ధ్య దూరం పెంచేసింది’ లాంటి రొడ్డ‌కొట్టుడు డైలాగులు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా వాడేశారు క‌దా. ఇన్ని చెబుతున్న హ‌రీష్ సాక్స్ డైలాగు గురించీ, సెల్ఫీ డైలాగు గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?

హ‌రీష్ యాటిట్యూడ్ గురించి తెలియని కొత్త విష‌యాలేం లేవు. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత‌.. ‘నా వ‌ల్లే ప‌వ‌న్‌కి హిట్టొచ్చింది’ అని కూయ‌డం హ‌రీష్ యాటిట్యూడ్‌కి నిలువెత్తు నిద‌ర్శ‌నం. అందుకే.. ‘గ‌బ్బ‌ర్ సింగ్ 2’ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు హ‌రీష్‌. గ‌బ్బ‌ర్ సింగ్ మిన‌హాయిస్తే.. (ఇది కూడా ఓ రీమేక్ సినిమా అనేది గుర్తించుకోవాలి) హ‌రీష్ ఖాతాలో ఒక్క‌టంటే ఒక్క హిట్టూ లేదు. డీజేని కూడా హిట్ అని అన‌లేం. డీజే భ‌విష్య‌త్తు మంగ‌ళ‌వారం నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది. అలాంటిది.. మీడియా ముందు హ‌రీష్ కాల‌ర్ ఎగ‌రేయ‌డం చూస్తే న‌వ్వొస్తుంది. డీజే ఓ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఓ రొటీన్ సినిమా. త‌ర‌చి చూస్తే.. బూతుల భాండాగారం బ‌య‌ట‌ప‌డుతుంది. అలాంటి సినిమాని ప‌ట్టుకొని.. ఏదో గొప్ప సినిమా తీసిన‌ట్టు ఫీల‌వుతున్నాడేమో! పైగా మాటి మాటికి ‘నేను బ్రాహ్మ‌ణుడ్ని.. బ్రాహ్మ‌ణుడ్ని’ అని ఎందుకు చెప్పుకొంటున్నాడో..! బ్రాహ్మ‌ణులంతా ఈ సినిమా చూసి గొప్ప‌గా చెప్పుకొంటారు అని చెప్పిన హ‌రీష్‌… అదే పాత్ర‌తో బూతులు ఎందుకు ప‌లికించాడో చెప్ప‌గ‌ల‌డా?

హ‌రీష్ క‌న్ను ఇప్పుడు రివ్యూల‌పై ప‌డింద‌న్న‌ది వాస్త‌వం. తాను గొప్ప సినిమా తీస్తే… విమ‌ర్శ‌కులు ప‌ట్టించుకోలేద‌ని ఫీలైపోతున్నాడు. ఇంత‌టి క‌ళాఖండం ఇంత వ‌ర‌కూ రాలేద‌ని ఎందుకు పొగ‌డ‌డం లేద‌ని బాధ‌ప‌డిపోతున్నాడు. హ‌రీష్ దే కాదు. అల్లు అర్జున్‌. దిల్‌రాజుల బాధ కూడా అదే.

వాళ్ల మ‌న‌సులోని బాధే… హ‌రీష్ నోటి నుంచి వ‌చ్చేసింది. విమ‌ర్శ‌కుల మాట‌ల్ని, రాత‌ల్ని ప‌క్క‌న పెట్టండి. సినిమా థియేటర్‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న ప్రేక్ష‌కుల ముందు మైకు పెట్టి చూడండి. వాళ్ల మ‌నసుల్ని స్కాన్ చేయండి. ఇంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్లంతా. క‌థ గురించీ. క‌థ‌నం గురించీ… ప్ర‌తీ సీన్ గురించీ చీల్చి చండాడుతున్నారు. ఆ మాట‌ల‌న్నీ.. హ‌రీష్ విన్నాడో.. లేదో?? ఫేస్ బుక్కుల్లో సామాన్య ప్రేక్ష‌కుడు రాస్తున్న రివ్యూలు.. హ‌రీష్ క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నాయో లేదో? మొత్తానికి థ్యాంక్స్ మీట్‌లో త‌న బాధ‌నంతా క‌క్కేసుకొన్నాడు హ‌రీష్‌! అయితే త‌న యాటిట్యూడ్ మాత్రం దాచుకోలేక‌పోయాడు. ఇంకో వారం ఆగితే… డీజే భ‌విష్య‌త్తు మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతుంది. అప్పుడు కూడా ఇలానే కాల‌ర్ ఎగ‌రేసి మాట్లాడ‌గ‌ల‌డా?? అప్పుడు అంత ధైర్యం ఉంటుందా..?? చూద్దాం..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.