హీరోలు…. మారండీ బాబూ..

విమర్శను తీసుకొనే గుణం సినీ పరిశ్రమ క్రమంగా కోల్పోతుంది. ఎంత సేపు భజనను ఇష్టపడతారు తప్పితే.. ఒక్క చిన్న విమర్శ చేసినా హర్ట్ అయిపోతారు. బాపు-రమణల సినిమా ఫ్లాఫ్ అని విమర్శకులు రాస్తే.. వాళ్ళపై వాళ్ళే కార్టూనులు వేసుకొని నవ్వేసేవారు. కానీ ఇప్పుడు అంత ఔచిత్యం వున్న సినీ ప్రముఖులు కనిపించడం లేదు. క్రియేటర్స్ కాదు.. ఈ మధ్య హీరోలు కూడా ఎదురుదాడి మొదలుపెట్టేశారు. ఓ సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. మీడియా ముఖంగానే సమీక్షలపై ఎదురుదాడి చేస్తున్నారు. ”మా సినిమాకి అదిరిపోయే వసూళ్ళు వస్తున్నాయి. రివ్యూ రాసే వాళ్ళకు ఏమీ తెలుసు” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజగా అల్లు అర్జున్ కూడా ఇదే పల్లవి అందుకున్నాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా డిజెకు ఫస్ట్ డే నే విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో విషయం లేదని, ఎదో తూతూ మంత్రంగా సినిమాని నడిపించారని, పరమ రొటీన్ స్టోరీని సమీక్షకులు రాశారు. ఇందులో వాస్తవం వుంది. అయితే ఈ సినిమాకి మంచి వసూళ్ళు వస్తున్నాయట.( లెక్కలు అడక్కండి. ఎవరూ చెప్పడం లేదు. ట్రెండ్ పండిట్ల ట్వీట్లే వసూళ్ళకు ప్రామాణికం) దీంతో థాంక్స్ మీట్ లో హీరో అల్లు అర్జున్ రెచ్చిపోయాడు. ”రివ్యూలు మా సినిమాను ఏం చేయలేవు. వసూళ్ళు చూసినా రివ్యూ రాసేవారు మారుతారేమో చూడాలి” అంటూ ఏదేదో మాట్లడేశాడు. నెగిటివ్ రివ్యూలు రాసిన వారందరూ చెడ్డోళ్లుగా అభివర్ణించేశాడు బన్నీ.

బన్నీనే కాదు. దాదాపు హీరోల పరిస్థితి అంతా ఇలానే వుంది. వున్నది వున్నట్లుగా రాస్తే ఎక్కడి లేని కోపం, అసహనం వచ్చేస్తాయి. మంచి రివ్యూలు ఇచ్చినపుడు రివ్యూ రైటర్లు అంతా సూపరే. కాని ఇలా నెగిటివ్ టాక్ వచ్చినప్పుడే సమీక్షకులపై ఎక్కడి లేని అసహనం వచ్చేస్తుంటుంది. దీనికి తోడు వసూళ్ళును చూపిస్తూ.. ”చూడండి.. మా సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్టో” అంటారు. ఇదేం వాదనో అర్ధం కాదు. కలెక్షన్స్ వచ్చాయి కదా అని సరైనోడు సినిమాని శంకరాభరణం జాబితాలో చేర్చలేం కదా. ”గుంటూరు టాకీస్” సినిమాకి డబ్బులు వచ్చాయని ‘గుండమ్మ కధ’ వరసలో పెట్టగలమా ? ఇది ఎప్పుడు అర్ధం చేసుకుంటారో…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.