మూడు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న హెరిటేజ్ సంస్థపై ఇటీవల జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ కో, హెరిటేజ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ కారణంగా హెరిటేజ్ వైస్ చైర్మన్ , ఎండీ నారా భువనేశ్వరి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, సంస్థ పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను ప్రజల ముందుంచారు.
నాణ్యతలో రాజీ లేని ప్రయాణం
హెరిటేజ్ కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, అది 33 ఏళ్ల సుదీర్ఘ నమ్మకం. రూ. 4 కోట్లతో ప్రారంభమై నేడు రూ. 4,000 కోట్ల టర్నోవర్కు చేరిన ఈ ప్రయాణంలో నాణ్యతే తమ ఊపిరి అని భువనేశ్వరి స్పష్టం చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థ, సుమారు 3 లక్షల మంది పాడి రైతులకు అండగా నిలుస్తోంది. ప్రతి పాలు , పాల ఉత్పత్తులు వినియోగదారుడికి చేరే ముందు 25 రకాల కఠినమైన నాణ్యత పరీక్షలను దాటాల్సి ఉంటుంది. 500 మంది నిపుణులు నిరంతరం పర్యవేక్షించే ఈ వ్యవస్థలో కల్తీకి తావులేదని ఆమె వివరించారు.
కుట్రపూరిత ప్రచారాలను తిప్పికొడుతూ వీడియో
రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల కిందటి పాత అంశాలను, కోర్టు స్టే ఇచ్చిన నోటీసులను సాకుగా చూపుతూ హెరిటేజ్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారని సంస్థ ఆరోపిస్తోంది. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన వైఫల్యాలను హెరిటేజ్ ఖాతాలో వేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఫేక్ సాక్ష్యాలను సృష్టిస్తున్నారని, ఇది కేవలం సంస్థపైనే కాకుండా, దానిపై ఆధారపడిన లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై చేస్తున్న దాడి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల భరోసా
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హెరిటేజ్ ఇప్పటికే న్యాయపోరాటం మొదలుపెట్టింది. అసత్యాలను ప్రచారం చేసే వారిని కోర్టు బోనులో నిలబెడతామని హెచ్చరించింది. ఇప్పటికే హెరిటేజ్ పై తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికీ లీగల్ నోటీసులు పంపింది. వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. ఫేక్ ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ బోనెక్కాల్సిందే. అదే సమయంలో వినియోగదారులకు చూసిందే నమ్మండి అనే నినాదంతో ముందుకు సాగుతున్న హెరిటేజ్, ప్రజారోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడబోమని భరోసా ఇచ్చింది.


