అదే పనిగా అబద్దాలు చెబుతూ హెరిటేజ్ కంపెనీపై బురద చల్లుతున్న బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లీగల్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 18న సాక్షి పత్రికలో వచ్చిన కథనం , అంతకుముందు బొత్స నిర్వహించిన ప్రెస్ మీట్లలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థదేనని, ఆ సంస్థ ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలు ముమ్మాటికీ తప్పని, ఇందాపూర్ డెయిరీతో తమకు కేవలం ఒప్పంద తయారీ సంబంధం తప్ప యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేసింది. హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్ గా ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రేరేపణతో రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న కుట్రలని సంస్థ ఆరోపించింది.
33 ఏళ్లుగా నాణ్యతకు మారుపేరుగా ఉంటూ అంతర్జాతీయ అవార్డులు పొందిన తమ సంస్థ పరువు తీయడమే ధ్యేయంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ మండిపడింది. ఈ తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. క్షమాపణ చెప్పని పక్షంలో కొత్త చట్టం B.N.S సెక్షన్ 356 కింద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
