రవిప్రకాష్ కేసులు..! పోలీసులపై హైకోర్టు ఆగ్రహం..!

ఓ మనిషిని ఇంతలా హింసిస్తారా..? అంటూ.. రవిప్రకాష్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై.. హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రవిప్రకాష్‌ను జీవితాంతం జైలులో పెట్టాలనుకుటున్నారా.. అని న్యాయస్థానం ప్రశ్నించింది. టీవీ9 కొత్త యాజమాన్యం పెట్టిన బోనస్ కేసులో బెయిల్ వస్తుందని తెలిసిన మరుక్షణంలో.. మరో కేసు నమోదు చేసి.. రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుట్ర పూరితంగానే రవిప్రకాష్‌ను అరెస్ట్ చేశారని… పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారమ జరిపిన హైకోర్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. రవిప్రకాష్‌పై వరుసగా పోలీసులు పెడుతున్న కేసు విషయంలో హైకోర్టు సీరియస్ అయింది.

పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే.. పోలీసులను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రవిప్రకాప్‌పై నమోదైన కేసులు వివరాలను.. మంగళవారంలోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రవిప్రకాష్‌ను జైల్లో ఉంచే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక కేసు కాకపోతే.. మరో కేసు.. ఏదో ఒక కేసు పెట్టి రవిప్రకాష్‌ను జైల్లో పెట్టాలనే ఆలోచనతోనే పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రవిప్రకాష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

అసలు రవిప్రకాష్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయో.. వాటికి ఆధారాలేమిటో ఇప్పుడు హైకోర్టుకు చూపించాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. ఓ ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశారన్న ఆరోపణతోనే… రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడం… న్యాయనిపుణులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. రవిప్రకాష్‌పై నమోదైన కేసులు.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. కచ్చితంగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులకు.. ఓ స్పష్టమైన ఆదేశాలు ఎవరి దగ్గర నుంచో వస్తున్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీటిని కోర్టు ముందు ఉంచేలా.. వాదించి.. అసలు రవిప్రకాష్ కేసుల విషయంలో ఏం జరుగుతుందో.. పోలీసులతోనే చెప్పించాలని .. ఆయన న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com