విమానాశ్రయం అంటే.. వీ వీఐపీ జోన్. అదీ కూడా..నేవీ అధీనంలో ఉన్న ఎయిర్ పోర్టు. వచ్చి పోయే ప్రతి ఒక్కరి కదలికలు.. నమోదవుతాయని.. అందరూ అనుకుంటున్నారు. కానీ విశాఖపట్నం విమానాశ్రయంలో..మూడు నెలల నుంచి అసలు సీసీ టీవీ ఫుటేజీనే రికార్డు కాలేదట. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు స్వయంగా.. హైకోర్టుకు చెప్పారు. అంతేనా… అసలు ఎయిర్ పోర్టులో సీసీ టీవీ నిర్వహణను ఏ విభాగం చూస్తుంది.. ఎవరు పర్యవేక్షిస్తారని… న్యాయమూర్తులు ప్రశ్నిస్తే.. ఎయిర్ పోర్టు అధికారులు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి ఘటనపై ధర్డ్ పార్టీ విచారణ జరిపించాలంటూ.. జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖ విమానాశ్రయ అధికారుల వ్యవహారం చూసి.. హైకోర్టు న్యాయమూర్తులు కూడా.. ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ప్రముఖులు ప్రయాణించే విమానాశ్రయంలో ఇంత దారుణంగా భద్రతా వైఫ్యల్యం ఉండటం క్షమించరానిదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సిట్ బృందం సీల్డ్ కవర్ లో ఇచ్చిన నివేదికను ఏ పి ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. జగన్ తరపున దాఖలైన పిటిషన్ ల పై లాయర్లు తమ వాదన వినిపించారు. ఏపి పోలీసుల దర్యాప్తు పై తమకు నమ్మకం లేదన్న వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. ఈ వాదనపై ధర్మాసనం..అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల పై నమ్మకం లేదంటే ఎలా అని ప్రశ్నిచింది. దాడి జరిగిన గంటలోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్.. దాడి చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమాని అని ప్రకటించారని అందుకే ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నట్లుగా లాయర్లు ధర్మాసనం ముందు వాదించారు. అయితే జగన్ పై ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో దాడి జరిగిన తర్వాత వైసీపీ నేతలు… సుమారు రెండు వందల ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారని… రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని… శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి, డీజీపీలు స్పందించాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్న ఎనిమిది మంది ప్రతివాదుల్లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా ఏడుగురికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరో వైపు వైసీపీ నేతల బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేతలు రాష్ట్రపతిని కోరారు.