జూబ్లిహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ .. గండిపేట మండలం మంచిరేవుల వద్ద చేపట్టిన జూబ్లీహిల్స్ ఫేజ్ IV ప్రాజెక్ట్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. RERA రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు చేసి ఫ్లాట్లు అమ్మకానికి ప్రయత్నం చేశారని.. ప్రతి దరఖాస్తుదారుని నుండి రూ. 5 లక్షల అడ్వాన్స్ వసూలు చేశారుని కోర్టులో కొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఇందులో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు.
సొసైటీలో సభ్యత్వం పొందడానికి తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ కొనాలి అని నిబంధన పెట్టారు. 800 కొత్త సభ్యులను చేర్చుతూ, ఒక్కో ఫ్లాట్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్కు HMDA, RERA అనుమతులు లేవు, ఎస్క్రో ఖాతా కూడా లేదు. సొసైటీ కమిటీ సభ్యులు సేకరించిన డబ్బులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారన్న ఆరోపణలుఉన్నాయి. రూ. 90 కోట్ల బుకింగ్ అమౌంట్, అదనంగా రూ.50 కోట్ల క్యాష్ కూడా సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలో హైకోర్టు ఈ ప్రాజెక్ట్‌పై స్టే ఆర్డర్ ఇచ్చింది.
13.7 ఎకరాల్లో 1910 యూనిట్లు, 40 ఫ్లోర్స్ ఉన్న భారీ ప్రాజెక్ట్‌కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని హైకోర్టు నిర్ధారించింది.ఈ ప్రాజెక్టుకు రెరా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. RERAలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్‌ను ప్రచారం, అమ్మకం, బుకింగ్ చేయరాదని ఆదేశించింది. జరిమానా కూడా విధించింది. ఆదేశాలు పాటించకపోతే Section 63 కింద మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫోర్ అంశం కూడా వివాదాస్పదంగా మారింది.