హైదరాబాద్: కడప నగర శివార్లలోని నారాయణ జూనియర్ కళాశాలో నిన్న ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటనపై ఇవాళ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆ కళాశాల రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణకు చెందినది కావటం, కళాశాలపై ఆగ్రహంగా ఉన్న విద్యార్థినుల తల్లిదండ్రులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగటంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. అధ్యాపకులు వేధించటంవల్లే తమ పిల్లలు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఆత్మహత్యచేసుకుంటే యాజమాన్యం తమకు వెంటనే సమాచారం ఇవ్వలేదని మండిపడుతూ తల్లిదండ్రులు, బంధువులు కళాశాలపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. వేధింపుల విషయమై తాము ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థినుల మృతదేహాలకు కడప రిమ్స్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ జరిగింది.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఆత్మహత్యచేసుకున్న పిల్లల తల్లిదండ్రులను ఓదార్చారు. తర్వాత అక్కడే ధర్నాకు దిగారు. మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, మంత్రి నారాయణపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణ కళాశాలలలో రాష్ట్రవ్యాప్తంగా 11మంది చనిపోయారని చెప్పారు. నారాయణ కళాశాలల్లో పిల్లలు పిట్టలు రాలినట్లు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థలకోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసేటట్లు చేస్తున్నారని అన్నారు. నారాయణ విద్యాసంస్థల వ్యాపారంలో చంద్రబాబుకుకూడా వాటా ఉందని చెప్పారు. తాజా ఘటనలో పిల్లలు సాయంత్రం నాలుగున్నరకు చనిపోయారని, ముఖ్యమంత్రి ఆరున్నరవరకు కడపలోనే ఉన్నా పిల్లల తల్లిదండ్రులను ఓదార్చలేదని ఆరోపించారు. పిల్లల ఆత్మహత్యలను పక్కదారి పట్టించేందుకు లవ్ లెటర్స్‌ను సృష్టించారని అన్నారు. పోస్ట్ మార్టమ్ సరిగా జరగలేదని ఆరోపించారు. మృతదేహాలకు తెలంగాణలో రీ పోస్ట్ మార్టమ్ జరిపించాలని, నారాయణ విద్యా సంస్థలను మూసేయాలని, నారాయణను జైలులో పెట్టాలని, ఈ ఘటనపై సీబీఐ(!?!?) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేపు కడప జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యార్థినుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.