హోం మంత్రి చెప్పినా అక్క‌డ ప‌ని జ‌ర‌గ‌లేద‌ట‌‌..!

అధికారం మార‌గానే… అధికారులు కూడా మారిపోతారు. వారికి అనుకూలంగా ఉండే అధికారుల‌ను త‌మ ప‌రిధిలోకి తెచ్చుకోవాల‌ని అధికార పార్టీకి చెందిన‌వారు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. గుంటూరు న‌గ‌ర పాల‌క సంస్థ‌లో కూడా ఇదే త‌ర‌హాలో ఇప్పుడు బ‌దిలీల హ‌డావుడి సాగుతోంది. కార్పొరేష‌న్ కి ఎన్నిక‌లు జ‌రిగి దాదాపు ద‌శాబ్దం కావ‌డంతో… ఇక్క‌డ అధికారుల‌దే హ‌వా. దీంతో గుంటూరులో త‌మ ప‌ట్టు సాధించుకోవాలంటే… అనుకూల‌మైన అధికారుల‌ను నియ‌మించుకోవాలి! ఇదే స‌మ‌యంలో… ఉన్న స్థానాల‌ను నిల‌బెట్టుకోవ‌డం కోసం అధికారులు కూడా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు కాదా! అయితే, ఈ బ‌దిలీ వ్య‌హ‌రంలో రాష్ట్ర హోంమంత్రితోపాటు, ఆమె కుటుంబ స‌భ్యుల జోక్యంపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక టౌన్ ప్లానింగ్ అధికారి త‌న స్థానాన్ని కాపాడుకోవ‌డం కోసం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ని స‌మాచారం. కొంత‌మంది పార్టీ పెద్ద‌లు క‌న్నేసి మ‌రీ త‌న స్థానంలోకి మ‌రొకర్ని తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నీ, దాన్ని అడ్డుకోవాలంటూ ఈ టౌన్ ప్లానింగ్ అధికారి కూడా గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసినా… ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంద‌ని స‌మాచారం. ఇంత‌కీ, ఆ అధికారికి అండ‌గా ఉన్న‌ది ఎవ‌రంటే.. హోంమంత్రి సుచ‌రిత అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ బ‌దిలీ అంశాన్ని ఆమె దృష్టికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ బ‌దిలీని ఆప‌డం కోసం నేరుగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తో హోంమంత్రి మాట్లాడార‌ని స‌మాచారం. అయినాస‌రే, ప‌ని జ‌ర‌గ‌లేద‌ట‌! దీంతో హోమంత్రి కాస్త అసంతృప్తికి గురైన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. నేరుగా తానే మాట్లాడినా ప‌ని జ‌ర‌గ‌లేద‌నే ఆవేద‌న‌ని ఆమె స‌న్నిహితుల ద‌గ్గ‌ర వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు.

అయితే, ఆ టౌన్ ప్లానింగ్ అధికారి బ‌దిలీని ఆప‌డం కోసం హోంమంత్రితోపాటు, ఆమె కుటుంబ స‌భ్యులు కూడా జోక్యం చేసుకోవ‌డం, వారూ క‌మిష‌న‌ర్ తో నేరుగా మాట్లాడ‌టంతో… ఆ ఐ.ఎ.ఎస్. అధికారికి బాగా చిరాకు తెప్పించిన వ్య‌వహారంగా ఇది మారింద‌నీ, అందుకే ఆయ‌న ఈ సిఫార్సుల‌న్నీ ప‌క్క‌న‌ప‌డేశార‌ని తెలుస్తోంది. చివ‌రికి, ఈ బదిలీల వ్య‌వహారంలో హోంమంత్రి కుటుంబ జోక్యం ఎక్కువైపోతోంద‌నే అంశం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ర‌కూ వెళ్లింద‌నీ, దీనిపై ఆయ‌న సీరియ‌స్ గానే రియాక్ట్ అయిన‌ట్టుగా అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎవ‌రి ప‌ని వాళ్లు చూసుకోవాలంటూ సీఎం క్లాస్ వేశార‌ని స‌మాచారం.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com