ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పయ్యావుల ప్రవేశపెట్టబోతున్న 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది. 2019 నాటికి ఒక గాడిన పడ్డ ఆర్థిక వ్యవస్థను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వస్తున్నారు. ఈ బడ్జెట్ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమన్వయం చేసే యజ్ఞంలా మారింది. రాష్ట్రం దాదాపు అప్పుల కుప్పగా మారి, ఆదాయ మార్గాలన్నీ తాకట్టులో ఉన్న తరుణంలో వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్.
పెరుగుతున్న పథకాల భారం – ఆదాయలేమి
గత ప్రభుత్వ హయాంలో కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఉన్న పరిశ్రమలు తరలిపోవడంతో రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. అదే సమయంలో సంక్షేమ పథకాల భారం మాత్రం గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏటా సుమారు 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తోంది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం అమలయ్యే ఇతర పథకాల ఖర్చుతో కలిపితే, ఖజానాపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. పెట్టుబడి వ్యయం లేకపోతే ఆదాయం పెరగదనే ఆర్థిక సూత్రాన్ని విస్మరించి, గత పాలకులు చేసిన అప్పులే నేడు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. ఈ పరిస్థితుల్ని గత ఇరవై నెలలుగా క్రమంగా మార్చుకుటూ వస్తున్నారు. పెట్టుబడి వ్యయం పెంచుకుంటూ.. పెట్టుబడులను తీసుకు వస్తూ.. ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నారు.
కేంద్ర సాయంపై గంపెడు ఆశలు
ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ప్రత్యేక ఆర్థిక సాయంపైనే ఏపీ ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు, అమరావతి నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవసరమైన అదనపు నిధులను కేంద్రం నుంచి ఈ ఏడాది అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఇప్పటికే ఏపీకి కొన్ని సానుకూల సంకేతాలు రావడంతో, రాష్ట్ర బడ్జెట్లో ఆ నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు మళ్లించేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యూహరచన చేశారు. ఆ ప్రయత్నం బడ్జెట్లో కనిపించనుంది.
ఆర్థిక స్థిరత్వమే అసలు ప్రణాళిక
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఆదాయ వనరులను పెంచుకోవడంపై దృష్టి సారించారు. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగం పునరుద్ధరణ ద్వారా ఆదాయాన్ని రాబట్టడంతో పాటు, వ్యవస్థల్లో పారదర్శకతను పెంచడం ద్వారా లీకేజీలను అరికడుతున్నారు. జగన్ హయాంలో కూలిపోయిన వ్యవస్థలను మళ్ళీ నిలబెట్టుకుంటూనే, ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ మీలను అమలు చేయడంపై ఈ బడ్జెట్లో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండనుంది. ఈ బడ్జెట్ కేవలం అంకెలు, కేటాయింపులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలోకి నడిపించే ఒక విజన్ డాక్యుమెంట్ గా ఉండనుంది.
