2026 తెలంగాణ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు భారత రాష్ట్ర సమితి పలుకుబడి వేగంగా తగ్గిపోతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రమంతా విస్తరించిన గులాబీ జెండా, ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కంచుకోచటల్లాంటి చోట్ల ఉనికి ఉండటం లేదు. కరీంనగర్, నిజామాబాద్ వంటి చోట్ల కార్పొరేటర్ స్థానాలు గెలవలేకపోతున్నారు. వరంగల్ వంటి చోట్ల ఆదరణ కోల్పోయారు. దక్షిణ తెలంగాణలో అసలు లెక్కలోకి రావడం లేదు.
ఉత్తర తెలంగాణలో మళ్లీ పుంజుకోవడం సాధ్యమేనా?
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పార్టీకి వెన్నెముకగా ఉండేవి. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోవడంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. క్షేత్రస్థాయిలో కేడర్ చెల్లాచెదురు కావడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం పక్క చూపులు చూడటం పార్టీ ఉనికిని కష్టతరం చేస్తోంది.
కాంగ్రెస్ కంచుకోటగా మారిన దక్షిణ తెలంగాణ
దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. ఇక్కడ బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి వంటి ఉద్దండులు సైతం తమ మున్సిపాలిటీని కాపాడుకోలేకపోవడం పార్టీ పతనాన్ని సూచిస్తోంది. ఖమ్మంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలవలేక పోవడం, దక్షిణ తెలంగాణలో పార్టీ పునరుజ్జీవం ఇక సాధ్యమేనా అన్న అనుమానాలను కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మున్సిపాలిటీ కే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలోనే ప్రస్తుత బలం
ప్రస్తుత ఈక్వేషన్ల ప్రకారం బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా , హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలోని మిగిలిన 80 శాతం ప్రాంతాల్లో ప్రభావం కోల్పోయి, కేవలం మెదక్ తో పాటు సిటీ శివార్లపై ఆధారపడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ను ఢీకొట్టాలంటే ఓట్లు చీలకుండా చూడటమే ఏకైక మార్గం. ఈ క్రమంలో *బీజేపీతో పొత్తు లేదా లోపాయికారీ అవగాహన భవిష్యత్తులో తప్పనిసరి కావచ్చు. కేవలం బీజేపీ బలమున్న ప్రాంతాల్లో ఆ పార్టీకి సహకరిస్తూ, తమ పట్టున్న చోట మద్దతు కోరడం ద్వారానే బీఆర్ఎస్ మళ్ళీ రేసులోకి రాగలదు. రాను రాను బీఆర్ఎస్ ఆలోచనలు కూడా ఇలాగే మారే అవకాశం ఉంది.
