హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొత్త ఇళ్ల కొనుగోలు తగ్గుతోంది. కానీ ఇళ్ల అద్దెలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఎవరూ ఊహించనంతగా పెరుగుతున్నాయి. గచ్చిబౌలి , హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు దేళ్లలో 50 శాతానికి పైగా పెరిగాయని అనరాక్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.
అనరాక్ నివేదిక ప్రకారం, హైదరాబాద్లోని 14 ప్రాంతాల్లో విలువలు 24-139 శాతం మధ్య పెరిగాయి, అద్దెలు 32-81 శాతం మధ్య పెరిగాయి. గచ్చిబౌలి , హైటెక్ సిటీలు ఈ రేసులో ముందున్నాయి. గచ్చిబౌలిలో విలువ 87 శాతం పెరిగింది. అద్దెలు 66 శాతం పెరిగాయి. 1,000 చదరపు అడుగుల ఇంటికి 2021లో రెంట్ రూ.22,000 ఉండగా ఇప్పుడు అది రూ.36,600కు చేరింది. హైటెక్ సిటీలో 1,000 చదరపు అడుగుల ఇంటికి రూ.23,000 నుంచి రూ.36,350కు చేరాయి.
అయితే అద్దెల పెరుగుదలలో బెంగళూరుదే రికార్డు. దేశవ్యాప్తంగా అత్యధిక అద్దె పెరుగుదల బెంగళూరు సర్జాపూర్ రోడ్లో 81 శాతం పెరుగుదల నమోదైంది, తర్వాత నోయిడా సెక్టార్-150 71 శాతం , మూడో స్థానంలో గచ్చిబౌలి 66 శాతం పెరుగుదల నమోదు అయింది.
2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ అద్దెల డిమాండ్ నిజాంపేట, మణికొండ వంటి ప్రాంతాలకు కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.