ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026పై మధ్యతరగతి గృహ కొనుగోలుదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద గృహ రుణ వడ్డీ రాయితీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత దశాబ్ద కాలంగా ఇళ్ల ధరలు, నిర్మాణ వ్యయం భారీగా పెరిగినప్పటికీ, ఈ మినహాయింపు పరిమితి మాత్రం 2014 నుండి మార్పు లేకుండా కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో నగరాల్లో ఒక మోస్తరు ఇల్లు కొనాలన్నా కనీసం రూ. 60 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నప్పుడు, ఏడాదికి చెల్లించే వడ్డీ రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటోంది. అయితే, పన్ను రాయితీ కేవలం రూ. 2 లక్షలకే పరిమితం కావడంతో మధ్యతరగతి జీవులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ పరిమితిని పెంచడం ద్వారా కొనుగోలుదారుల చేతిలో నగదు లభ్యత పెరిగి, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వస్తుందని రియల్టీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి.
ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని అనుసరించేవారికి ఈ తీపి కబురు అందవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వడ్డీ రాయితీతో పాటు, సరసమైన గృహాల ధరల పరిమితిని కూడా రూ. 45 లక్షల నుండి రూ. 75 లక్షలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది కేవలం గృహ కొనుగోలుదారులకే కాకుండా సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ రంగాలకు కూడా మేలు చేకూరుస్తుంది.
