ప్రత్యేక హోదా వల్ల లాభం వట్టిమాటేనని అదేపనిగా వాదిస్తున్న తెలుగుదేశం నేతలు వ్యాపార విధాతలు ఇప్పటికీ ప్రత్యేక హోదా కలిగివున్న ఉత్తరాఖండ్లో మాత్రం ఆ సదుపాయాలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి సోమవారం(26) సంచికలో బయిటపెట్టిన ఆ విశేషాలు ఆసక్తికరంగానే గాక ఒక విధంగా అసహనం కలిగించేవిగా కూడా వున్నాయి.ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్నదెవరంటే – కేంద్రం తరపున హౌదా నిరాకరణను మింగించడంలో కీలక పాత్ర వహించిన మంత్రి సుజనా చౌదరి! ఆయనకు సంబంధించిన న్యూలాండ్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ ఉత్తరాఖండ్లో ఫ్యాన్ల తయారీ యూనిట్ నెలకొల్పింది. ఆ కంపెనీ చైర్మన్ హోదా లో సుజనా చౌదరి 2006లో విడుదలచేసిన నివేదికలో ప్రత్యేక హోదా వల్ల కలుగుతున్న ప్రయోజనాలను సవివరంగా పొందుపరిచారు. ఎక్సయిజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను, కేంద్ర సర్వీస్ టాక్స్ వంటివి వుండకపోవడం వల్ల ఉత్పత్తికి విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అందులో పేర్కొన్నారు.
ఇక రాజ్యసభలోనూ అధినేత ఆత్మీయ సభ్యుడు సిఎం రమేష్ కూడా ప్రత్యేక హోదా వుందనే ఉత్తరాఖండ్లో నార్త్ ఈస్ట్రన్ పవర్ ప్రాజెక్ట్సులో 69 లక్షలు పెట్టుబడి పెట్టానని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక తెలుగుదేశంలో చేరి గుంటూరు ఎంపిగా ఎన్నికైనా యువ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ అమరరాజా బ్యాటరీస్ కంపెనీ కూడా ఉత్తరాంచల్లో ప్టాంటును ఏర్పాటు చేసేందుకు భూమి కొనుగోలు చేసింది. వినుకొండ ఎంఎల్ఎ జివిఆంజనేయులు ఉత్తరాఖండ్లో హరిద్వార్ సమీపంలో రుద్రపూర్లో శివశక్తి బయోప్టాంటెక్ ఏర్పాటుచేశారు. ఈ జాబితాలో మరికొంత మంది తెలుగుదేశం ఘనాపాటీలతో పాటు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా ఏవో పెట్టుబడులున్నాయంటున్న తెలుగుదేశం నేతలు అందరికన్నా ఎక్కువగా తమ వారే ప్రత్యేకహోదా ప్రయోజనాలు పొందుతూ ఇక్కడ అందుకు విరుద్దంగా మాట్లాడ్డం ఏమిటని వాపోతున్నారట. అదే మరి రాజకీయం అంటే!