హైదరాబాద్ శివార్లలోని జన్వాడ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పటి సత్యం కంప్యూటర్స్ స్కామ్ తాలూకు మూలాలు ఇప్పుడు భూ కబ్జా ఆరోపణల రూపంలో నాంపల్లి ఈడీ కోర్టు మెట్లెక్కాయి. రిటైర్డ్ జడ్జి ఆవుల సాంబశివరావు బంధువు ఆవుల అనిత దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న రామలింగరాజు కుటుంబ సభ్యులతో పాటు 213 మందికి నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
వందల కోట్ల విలువైన భూమిపై కన్ను
దాదాపు రూ. 300 కోట్ల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితురాలు అనిత తన పిటిషన్లో పేర్కొన్నారు. 1950ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసలు యజమానుల పేర్లను తొలగించి, ఫోర్జరీ పత్రాలతో మ్యూటేషన్లు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సత్యం స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును మళ్లించి జన్వాడలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, ఆ సమయంలోనే అమాయక రైతుల భూములను బినామీ కంపెనీల పేరుతో లాగేసుకున్నారని బాధితులు వాపోతున్నారు.
తప్పుడు పత్రాలతో మ్యూటేషన్లు?
ఈ కేసులో అత్యంత వివాదాస్పదమైన అంశం మ్యూటేషన్ ప్రక్రియ. రామలింగరాజు మరదలు రాధ పేరు మీద భూ బదలాయింపు జరిగిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో రాధ భర్తగా రామలింగరాజు పేరును చూపిస్తూ, తప్పుడు ఆధారాలతో భూమిని తమ పేరిట మార్చుకున్నట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందని, రాజకీయ పలుకుబడితో పాత పహాణీలను సైతం తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
జన్వాడలోని సర్వే నెంబర్ 311/1 తో పాటు 306 నుండి 316 వరకు ఉన్న వందల ఎకరాల భూములపై ఇప్పుడు న్యాయపోరాటం మొదలైంది. గతంలో శతభిష అనే కంపెనీ ద్వారా జరిగిన లావాదేవీలన్నీ మనీ లాండరింగ్ కిందకే వస్తాయని, వీటిని ఈడీ జప్తు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఈడీ కోర్టు బి. రామలింగరాజు, తేజ రాజు, నందిని రాజు సహా మొత్తం 213 మందికి నోటీసులు పంపింది.
తేలాల్సిన అసలు నిజాలు
దశాబ్దాల క్రితం జరిగిన సత్యం స్కామ్ నీడలు ఇంకా జన్వాడ భూములను వెంటాడుతూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో, ఈ భూముల వెనుక ఉన్న బినామీల డొంక కదిలే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఈ ఫైళ్లు కదలడం, ఈడీ కోర్టు సీరియస్గా స్పందించడం చూస్తుంటే, బాధితులకు త్వరలోనే న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రాథమిక వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయని ఇంకా సంచలన విషయాలు వెల్లడి కావాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
