హ్యూస్టన్ రాక్ స్టార్ ఈవెంట్ “హౌడీ – మోడీ”..!

అమెరికాలో బయట దేశాల ప్రధానులు చేపట్టిన కార్యక్రమాల్లో హౌడీ..మోడీ ఇప్పటి వరకూ ఎవరూ చేయనంత భారీగా నిర్వహిస్తున్నారు. హ్యూస్టన్‌ నగరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు సాగాయి. 50 వేల మంది ఇండియన్‌-అమెరికన్లను హాజరవబోతున్నారు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. మరోవైపు ప్రధాని మోదీ.. అమెరికాలోని అతిపెద్ద ఈవెంట్లలో ఒకటిగా నిలిచేందుకు హౌదీ- మోదీ సిద్ధమైంది. ఓ ఈవెంట్‌కు 50 వేల మంది రావడం అనేది గొప్ప కార్యక్రమం. అమెరికాలో ఏ విదేశీ నేతకు ఈ స్థాయిలో జనాలు గతంలో రాలేదు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 1500 వందల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.

వాషింగ్టన్‌, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో లాంటి నగరాలను కాదనుకొని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరాన్నే మోడీ ఎంచుకున్నారు. అక్కడి నుంచి భారత్‌కు వాణిజ్యం ఎక్కువగా ఉండటమే కారణం. అమెరికాతో ఇంధన బంధమే లక్ష్యంగా మోదీ తన సభ కోసం హ్యూస్టన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భారత్‌లో చమురుకు విపరీత డిమాండు ఉంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల తర్వాత అక్కడ్నుంచి భారత్‌కు చమురు ఎగుమతులూ ఆగిపోయాయి. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను చైనా ఆపేసింది. దీంతో అమెరికా చమురు వ్యాపారులు భారత్‌ వైపు దృష్టిసారించారు. ఇందులో భాగంగానే భారత్‌-అమెరికా ఇంధన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటిగా పేరున్న హ్యూస్టన్‌లో దాదాపు 16 చమురు కంపెనీల సీఈవోలతో మోదీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు. ఈ నగరంలో నివసిసుస్తున్న లక్షల మంది భారత సంతతికి చెందిన వారు అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.

మోడీతో పాటు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటే.. మోదీ ఫ్యాన్స్‌లో కొందరు తనకు ఓట్లు వేస్తారన్న ఆశలో ఉన్నారు ట్రంప్‌..! అయితే ఈ ఈవెంట్‌లో ట్రంప్‌ ఎలాంటి హామీలు ఇచ్చినా.. ప్రకటనలు చేసినా.. అది పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. అటు ఇండియన్‌ అమెరికన్లలో.. అత్యధిక మంది డెమోక్రాట్‌ నేత కమల హారీస్‌కు నిధులు సమకూరుస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రవాస భారతీయుల ఓట్లతో పాటు నిధుల కోసం కూడా ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ట్రంప్‌ ఆవలంభించిన ఇమ్మిగ్రేషన్‌ విధానాలపై ఇండియన్‌ అమెరికన్లలో ఆగ్రహం నెలకొంది. ఇప్పుడు ఆ ఇమేజ్‌ నుంచి బయటపడేందుకు కూడా ట్రంప్‌కు ఈ ఈవెంట్‌ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com