బాహుబలి సృష్టించిన సంచలనాలను బాహుబలి 2 కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏరియాల వారిగా బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం మొదలెట్టింది. నైజాం హక్కుల్ని ఏషియన్ సంస్థ ఏకంగా రూ.45 కోట్లకు కైవసం చేసుకొంది. ఇది కనీవినీ ఎరుగని రికార్డ్. బాహుబలి తొలి భాగాన్ని రూ.20 కోట్లకు దిల్‌రాజు కొనుగోలు చేశాడు. ఆ సినిమాకి మరో ఇరవై కోట్ల వరకూ లాభాలొచ్చాయి. అంటే బాహుబలి 1 స్టామినా రూ.40 కోట్లన్నమాట. బాహుబలి 2పై పెరిగిన అంచనాల దృష్ట్యా బాహుబలి 2ని రూ.40 కోట్లకు కొన్నారంటే.. ఓహో అనుకోవొచ్చు. కానీ రూ.40 కోట్లకు కోడ్ చేసి, ఫ్యాన్సీ రేటుకు దగ్గించుకోవడం చూస్తుంటే బాహుబలి 2ని అతిగా నమ్ముతున్నారేమో అనిపిస్తోంది.
రూ.45 కోట్లని తిరిగి రాబట్టుకోవాలంటే ఆ సినిమా నైజాంలో కనీసం రూ.90 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయాలి. నైజాం మార్కెట్‌కి అంత స్థాయి లేదు. బాహుబలి 1కీ, బాహుబలి 2కీ రెండేళ్ల విరామం వచ్చింది. ఈలోగా ఆడియన్స్ సంఖ్యలో పెద్దగా మార్పులేదు. కనీసం 10 శాతం వసూళ్లు పెరుగుతాయోమో? ఎంత చూసుకొన్నా రూ.45 కోట్లు అన్నది టూ మచ్ అనుకోవాలి. అయితే బాహుబలి హైప్ మరింత పెంచడానికి లేని అంకెల్ని చూపిస్తున్నారేమో అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. నైజాంలో ఓ సినిమాకి రూ.45 కోట్లకు కొనడం సాధారణ విషయం కాదని, సడన్ గా టికెట్టు రేట్లు డబుల్ అయితేగానీ,ఆ మొత్తాన్ని దక్కించుకోవడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.