హైదరాబాదీ అమ్మాయిలూ… కీచకులున్నారు జాగ్రత్త

అడుగడుగునా అపర కీచకులు. హైదరాబాదులో మహిళలు, యువతుల శీలాన్ని దోచుకోవడానికి వివిధ రకాలుగా వల వేసే వారి పని సులువవుతోంది. బేలగా వలలో చిక్కే అమ్మాయిలకు హైదరాబాదులో కొదువ లేదని ఈమధ్య మరోసారి రుజువైంది. కన్సల్టెన్సీ పేరుతో దాదాపు 300 మంది అమ్మాయిలను లొంగదీసుకున్న ఎఫ్ సి ఐ మాజీ ఉద్యోగి మధు నిర్వాకం తెలిసినప్పుడు, హైదరాబాదీ అమ్మాయిలను లోబర్చుకోవడం ఇంత సులభమా అనిపిస్తుంది. మంచి మార్కులు, ర్యాంకులు ఇప్పిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని నాలుగు మాయమాటలు చెప్పగానే అమ్మాయిలు లొంగిపోయారట. ఇంటికి పిలిచి శారీరకంగా వాడుకోవడానికి సిద్ధపడ్డప్పుడైనా అతడు ఎలాంటి వాడో తెలుసుకోలేదు. ఏదో మేలు చేస్తాడని శారరీరంగా లొంగిపోయారు. మాయమాటలు, ఉద్యోగంపై ఆశలే అస్త్ర్రంగా వందల మంది అమ్మాయిలను లొంగదీసుకున్న వాడికంటే, అతడికి అంత బేలగా లొంగిపోయిన అమ్మాయిల తీరే ఆశ్చర్యకరం.

లొంగిపోకపోతే ఉద్యోగం రాదనుకున్నారో, లేక అతడి ఇంట్లోంచి బయటకు రాలేకపోయారో. కొందరు అమాయకంగా లొంగిపోయి ఉంటారు. మరికొందరు ఆ ఇంట్లోంచి బయటకు రాలేక లొంగిపోయి ఉంటారు. అయితే, కన్సల్టెన్సీ అయితే ఆఫీసు ఉంటుంది. అంతేగానీ ఇంటికి రమ్మన్నప్పుడే అమ్మాయిలు అనుమానించాలి కదా. లేదా కన్సల్టెన్సీ గురించి స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంటికి వెళ్లేదాకా వచ్చేది కాదేమో.

పిల్లలు తమ కెరీర్, చదువు గురించి పెద్దవాళ్లతో మాట్లాడితే ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కన్సల్టెన్సీ వారు ఫోన్ చేశారు, ఇంటికి రమ్మన్నారని పెద్దవాళ్లతో చెప్తే వాళ్లు కచ్చితంగా అనుమానిస్తారు. ఇంటికి రమ్మనడం ఏమటని ఆరా అయినా తీస్తారు, లేదా వెళ్లవద్దని పిల్లలకు సలహా ఇస్తారు. కాబట్టి అపరకీచకులకు లొంగిపోయే అనర్థం రాకుండా బయటపడతారు అమ్మాయిలు. కానీ అలా జరగలేదు. అంతేకాదు, నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్లతో యువతులను బెదిరించి లొంగదీసుకుని, డబ్బులు గుంజిన వాడి బాగోతం కూడా ఈ మధ్య బయటపడింది. హైక్లాస్ విద్యాసంస్థల్లో చదివే వారినే టార్గెట్ చేసిన తీరు ఆశ్చర్యకరం. ఇక, రెండు వారాల క్రితం ఓ ఎయిడ్స్ పేషెంట్ వందల మంది ఆడవాళ్లకు ఆ రోగాన్ని అంటించడమే పనిగా పెట్టుకున్నాడని తేలింది. అతడి వల్ల ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డవాళ్ల పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరం.

పరాయి వాడు శారీరకంగా లొంగదీసుకునేటప్పుడు ఎదురు తిరిగితే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. ఒక్క అమ్మాయి ఫిర్యాదు కారణంగా అపర కీచకుడి బండారం బయటపడింది. అలా, ప్రతి అమ్మాయి తెలివిగా, ధైర్యంగా ఆలోచిస్తే వారి శీలంతో ఆడుకునే వారి ఆట కట్టించవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటే ఇలాంటి ప్రమాదాలను వారు పసిగట్టి హెచ్చరించే అవకాశం ఉంటుంది. ఎవరికీ వారు బిజీ అయిపోయి, పక్కన ఉన్నవారిని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న వారితో చాటింగ్ చేస్తూ ఫేస్ బుక్ లో కాలక్షేపం చేస్తూ ఉంటే జరగకూడని దారుణాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com