హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని కోర్టు ఎదుట హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని డెడ్ లైన్ విధించింది. ఈ సారి రంగనాథ్ హైకోర్టు ముందు హాజరు కాక తప్పదు. రంగనాథ్ దూకుడు.. ఇమేజ్ కోసం చేస్తున్న ఫీట్ల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయినా ఏ మాత్రం మారేందుకు సిద్ధంగా లేదు హైడ్రా.
వేల కోట్ల విలువైన భూములు కాపాడుతున్నట్లు ప్రచారం
హైడ్రా నుంచి ఖచ్చితంగా ప్రతి వారం రెండు, మూడు అప్ డేట్స్ వస్తాయి. తాము పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టి వేల కోట్లు విలువైన ప్రభుత్వ భూములు కాపాడామని చెబుతూ ఉంటారు. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తాయి. కొన్ని చెరువుల ఆక్రమణల తొలగింపు విషయంలో హైడ్రాకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా బతుకమ్మకుంట విషయంలో అందరూ ప్రశంసించారు. కానీ ప్రజాస్వామ్యంలో చట్ట ప్రకారం చేస్తేనే ఆ ప్రజా ప్రశంసలకు వ్యాలిడిటీ ఉంటుంది. అలా హైడ్రా చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టాభూముల్లోనూ రాత్రికి రాత్రే కూల్చివేతలు
బతుకమ్మ కుంట స్థలం తమదేనని ఓ బీఆర్ఎస్ నేత క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ కేసు కోర్టులో ఉంది. కానీ హైడ్రా పట్టించుకోలేదు. అదే సమయంలో కనీసం పది వరకూ కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రాపై పడ్డాయి. హైకోర్టు కూల్చివేయవద్దని ఆదేశాలు ఇచ్చినా కూల్చివేసిందని ఆయా యాజమానులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సంధ్యా ప్రాజెక్ట్స్ అనే సంస్థకు.. డీఎల్ఎఫ్ పక్కనే స్థలాలు ఉన్నాయి. ఓ హౌసింగ్ సొసైటీతో వివాదం ఉంది. ఆ విషయంపై తెల్లవారుజామునే కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక్కటే కాదు.. తమ పట్టా భూముల్లోనూ అలాగే చేశారని చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించారు. అన్నీ ధిక్కరణలే.
కూల్చివేతలు చట్టం ప్రకారమే జరగాలి!
హైడ్రా కేవలం పబ్లిసిటీ, పబ్లిక్ ఇమేజ్ కోసమే కూల్చివేతలు చేపడుతోందని చట్టాలను పట్టించుకోవడంలేదని లేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అవి కోర్టు కేసులుగా మారుతున్నాయి. ఓ గేటెడ్ కమ్యూనిటీ గోడను.. గేటును కబ్జా కాకపోయినా కూలగొట్టి వివాదాస్పదమయ్యారు. ఇలాంటి సమస్యలు ,ఆరోపణలు హైడ్రాపై చాలా ఉన్నాయి. చట్టాలను పట్టించుకోకుండా.. కూల్చివేత అధికారం ఉందని.. అలా న్యాయం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. హైకోర్టు అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.