తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు లక్ష్యంగా సాగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. గత కొద్ది రోజులుగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేస్తూ, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తక్షణమే ఈ అంశంపై గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. బి.ఆర్. నాయుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఎలాంటి అభ్యంతరకర వీడియోలు, వార్తలు లేదా కథనాలను ప్రసారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలను న్యాయస్థానం ఆదేశించింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని గూగుల్, ఎక్స్ , ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ , యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తిరుమల పవిత్రతను దెబ్బతీయడంతో పాటు, టీటీడీ ఛైర్మన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు ఈ మార్ఫింగ్ వీడియోలను సృష్టించారని బి.ఆర్. నాయుడు తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ప్రచారంలో వాడిన దృశ్యాలు కొన్ని దశాబ్దాల క్రితం ఫ్యామిలీ ఫంక్షన్లకు సంబంధించినవని, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అసభ్యంగా మార్చారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలతో దుష్ప్రచారం చేస్తున్న వారికి గట్టి చెక్ పడినట్లయింది. తిరుమల ప్రసాదం, ఇతర అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలోనే, కావాలనే తనపై ఇటువంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని బి.ఆర్. నాయుడు ఇప్పటికే మండిపడ్డారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వీడియోల మూలాలు ఎక్కడ ఉన్నాయి, వీటి వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.