పాతబస్తీలో జరిగిన ఘోర ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడం వల్ల వచ్చిన పొగతో అందరూ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్పృహకోల్పోయారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకుని వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. మొదట నలుగురు, ఐదుగురు చనిపోయారని అనుకున్నారు కానీ.. మృతుల సంఖ్య 17కు చేరింది. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీ కూడా స్పందించారు.
చార్మినార్ దగ్గరలో గుల్జార్ హౌస్ ఉంది. ఈ కాంప్లెక్స్ లో ఓ బంగారు దుకాణాన్ని బెంగాల్ కు చెందిన వ్యక్తి నిర్వహిస్తున్నారు. వీరి ఇంటికి బెంగాల్ నుంచి బంధువులు వచ్చారు. నాలుగు కుటుంబాలకు చెందిన వారు వచ్చారు. వీరంతా భవనం పై అంతస్తులో ఉన్న దుకాణం యజమాని ఇంట్లోనే ఉంటున్నారు. రాత్రి అందరూ ఇంట్లో పడుకున్నారు. ఆ సమయంలో ఏసీ పేలిపోయింది. పొగ విపరీతంగా వచ్చింది. కొంత మంది పరిస్థితిని గమనించి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. టెర్రస్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల గేటుకు తాళం వేయడంతో ..కిందకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అవి చాలా చిన్న మెట్లు. గుహలా ఉండటంతో సాధ్యం కాలేదు. ఈ లోపు పొగపెరిగిపోయింది.
పదిహేడు మంది చనిపోవడంతో ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతికి గురయింది. ముఖ్య నేతలంతా వచ్చి సహాయ చర్యలు పర్యవేక్షించారు. ఏసీ పేలిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని దానివల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిర్దారించారు. చనిపోయిన వారంతా బంధువులు.. దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది.