రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన పోటీ , అమ్మకాల్లో కనిపిస్తున్న మందగమనం కారణంగా బిల్డర్లు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. కేవలం ఫ్లాట్ ధరలో తగ్గింపు ఇవ్వడం కంటే, కస్టమర్లను ఆకర్షించడానికి ఖరీదైన బహుమతులను ఎరగా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో కొత్తగా వెలుస్తున్న ప్రాజెక్టులలో ఇన్వెంటరీని త్వరగా క్లియర్ చేసేందుకు బిల్డర్లు ఈ ‘గిఫ్ట్ పాలిటిక్స్’ను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల బిల్డర్లు ఫ్లాట్ బుకింగ్‌పై ఏకంగా హార్లీ డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్‌లను , ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లను ఆఫర్ చేస్తున్నారు. మధ్యతరగతి విభాగానికి చెందిన అపార్ట్మెంట్లలో అయితే 10 నుండి 14 గ్రాముల బంగారం, గృహోపకరణాలు, విదేశీ పర్యటనల వంటి ఆఫర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపడం ద్వారా మందగించిన మార్కెట్‌కు మళ్లీ ఊపిరి పోయవచ్చని బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు.
ఇలాంటి ఆఫర్ల వెనుక ఉన్న లోతుపాతులను కొనుగోలుదారులు గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఈ బహుమతుల విలువను ఫ్లాట్ ధరలోనే కలిపి ఉంచుతారని, లేదా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నప్పుడే ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటిస్తారని విశ్లేషిస్తున్నారు. ఉచితంగా వచ్చే బైక్ లేదా బంగారం కంటే, సదరు ప్రాజెక్టుకు RERA అనుమతులు ఉన్నాయా లేదా, బిల్డర్ గత ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూడటం ముఖ్యమని సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఉచిత ఆఫర్ల అవసరం ఉండదు. కానీ ప్రస్తుతం వ కొత్త ప్రాజెక్టులు భారీగా పెరిగిపోవడంతో డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది. ఈ అసమతుల్యతను అధిగమించడానికి బిల్డర్లు తమ మార్కెటింగ్ బడ్జెట్‌ను ఇలాంటి లగ్జరీ బహుమతుల రూపంలో నేరుగా కస్టమర్లకే బదిలీ చేస్తున్నారు. కొనుగోలుదారులు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు, ఆస్తి విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే సరైన నిర్ణయం తీసుకోగలరు.


