హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే అంతా ఐటీ కారిడార్ .. ఆ చుట్టుపక్కల గురించి మాట్లాడుతూంటారు. కానీ అక్కడ నిజంగా ఇళ్లు కొని నివాసం ఉండేవాళ్లు తక్కువ. పెట్టుబడుల రూపంలో మనీని డంపింగ్ చేసేవారు ఎక్కువ. నిజంగా ఇళ్లు కొనే నిఖార్సైన కొనుగోలుదారులు అందుబాటులో ఉన్న ప్రాంతాల వైపు చూస్తూంటారు. అలాంటివి చాలా ఉన్నాయి. విజయవాడ హైవే వైపు నివాసం ఉండాలనుకునే మధ్యతరగతి వారికి అలాంటి అనువైన ప్రాంతాం తొర్రూరు.
రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ మండలంలో ఉంటుంది తొర్రూరు. విజయవాడ-హైదరాబాద్ హైవే (NH-65) సమీపంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) , NH-65 సమీపంలో ఉండటంతో రోడ్ కనెక్టివిటికీ సమస్యలు లేవు. సమీపంలోని హయత్నగర్, ఎల్.బి.నగర్, వనస్థలిపురం ఉన్నాయి. అందుకే విద్యా, వైద్య సౌకర్యాలకు కొదవలేదు. షాపింగ్ మాల్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి.
తొర్రూరు ఇప్పుడిప్పుడే రియల్ హబ్ గా మారుతోంది. ఇప్పటికీ ఎక్కువగా ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మిస్తున్నాయి. చిన్న బిల్డర్లు ఇండిపెండెంట్ హౌస్లు, అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఓపెన్ ప్లాట్ల ధరలు సాధారణంగా చదరపు గజానికి పాతిక వేల వరకూ చెబుతున్నారు. అంత కంటే తక్కువకూ వస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్న లే ఔట్లలో కాస్త ఎక్కువ రేటు ఉంటుంది. అపార్టుమెంట్ల ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని బ్రోకర్లు చెబుతున్నారు. 2 BHK ఫ్లాట్ ను 40 లక్షల నుండి 60 లక్షల వరకు చెబుతున్నారు. తొర్రూరు వంటి ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్కు మంచివి.