హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా మంగళగిరి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు వారి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా హైడ్రా అంశాలపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటు సమయంలో .. రంగనాథ్ తీసుకున్న చర్యలు, బడాబాబుల ఫామ్ హౌసుల్ని కూలగొట్టి చెరువుల్ని కాపాడిన వైనానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కూడా.. ఏపీకి కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తర్వాత హైడ్రా దూకుడు కారణంగా చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా అమీన్ పూర్ లో కూల్చివేతల తర్వాత పేదల ఇళ్లపైకి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. దాంతో హైడ్రాకు వచ్చిన పాజిటివ్ ఇమేజ్ పోయి..నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత దూకుడు తగ్గించుకున్న హైడ్రా ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా నుంచి కాపాడి.. ఫెన్సింగ్ వేస్తున్నారు. బతుకమ్మ కుంటకు పూర్వ స్థితి తీసుకురావడం మంచి పేరు తెచ్చిపెట్టింది.
హైడ్రా లక్ష్యాలు.. ఏపీలో హైడ్రా పద్దతుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలపై రంగనాథ్ తో పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలపై మాట్లాడుకుందామని..పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరుక రంగనాథ్.. మంగళగిరి వచ్చారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.