హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ అయింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలకు పాల్పడేవారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఏసీపీ, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లను సిబ్బందిగా నియమించారు.
హైడ్రాకు సుమారు 70కిపైగా వాహనాలు కేటాయించారు. 40కిపైగా స్కార్పియోలు, 20 డీసీఎంలు, ద్విచక్రవాహనాలు, టిప్పర్లను హైడ్రా కొనుగోలు చేసింది. వాటన్నింటిని గురువారం సీఎం సమక్షంలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించనున్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షల్లో స్వల్ప మార్కులతో ఉద్యోగం కోల్పోయిన 150 మందిని డీఆర్ ఎఫ్ లోకి హైడ్రా తీసుకుంది. భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువుల్లో మట్టిపోసి కబ్జాచేయడం, నాలాలు ఆక్రమించడం సహా తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించుకోవడం, రహదారులకి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం వంటి వాటిని కూల్చేస్తామని హైడ్రామా చెబుతోంది.
హైడ్రా వ్యవహారం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. బడాబాబులపై ఏదైనా చేస్తే వారు న్యాయపోరాటమో.. మరొకటో చేస్తారు కానీ సామాన్యులు ఏం చేయలేరు. అందుకే హైడ్రా అంటే వారు భయపడుతున్నారు. కనీస సమాచారం లేకుండా.. కూల్చివేతలకు హైడ్రా వెళ్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ హైడ్రా వల్లనే పడిపోయిందన్న ఆందోళన ఉంది. ఇక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటయితే.. ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.