వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు , గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల నుంచి తన పేరును తొలగించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్లను తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తూ.. కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాను విధులు నిర్వహించానని, ఇందులో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అయితే, సీబీఐ తరపు న్యాయవాదులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. మైనింగ్ లీజుల కేటాయింపులో , క్విడ్ ప్రో కో వ్యవహారాల్లో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని, నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేసు ఈ దశలో ఉన్నప్పుడు ఆమె పేరును తొలగించలేమని స్పష్టం చేసింది. సీబీఐ మోపిన అభియోగాల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన కోర్టు, ట్రయల్ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది.
ఈ తీర్పుతో శ్రీలక్ష్మి ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఓబులాపురం గనుల కేసులో నిందితులందరికీ జైలు శిక్ష ఖరారు అయింది. ఒక్క శ్రీలక్ష్మి గతంలో హైకోర్టు నుంచి డిశ్చార్జ్ ఉత్తర్వులు తెచ్చుకున్నందున ఆమెపై విచారణ జరపలేదు. ఇప్పుడు ఆ ఉత్తర్వులను కొట్టివేసినందున.. ఆమెకు కూడా శిక్ష ఖరారు కావడం ఖాయమని భావిస్తున్నారు. ఈ కేసుల కారణంగా గతంలో ఆమె చాలా కాలం జైల్లో ఉన్నారు. అయినా ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తెలంగాణ నుంచి.. ఏపీకి వచ్చారు. జగన్ ప్రభుత్వం మరిన్ని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు పోస్టింగ్ దక్కలేదు.