ఏ పార్టీలో అయినా అధినేతకు గౌరవం ఇవ్వాలి. అధినాయకత్వం చెప్పినట్టే నడుచుకోవాలి. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, నాయకులు ఎవరైనా సరే అధినేత ఆదేశాలను ఫాలో కావాలి. తెలుగుదేశం పార్టీలో అయితే ఇంతకు మించిన కమాండ్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే నాయకులు ఎవ్వరూ మారుమాటాడరు అనుకుంటారు. అయితే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉందన్నది వాస్తవం! ఎందుకంటే, పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ఎన్నో రకాలుగా చితికిపోయింది. ఒక ప్రాంతీయ పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోడం మామూలు విషయం కాదు. ఆ తరువాత, పార్టీని ఆర్థికంగా ఆదుకున్న కొంతమందికి ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. అలా చెప్పేకన్నా… వారే ఆ ప్రాధాన్యతను తీసుకున్నారు! అయితే, వారేం చేస్తున్నా.. వారి తీరుపై అసంతృప్తి ఉన్నా కూడా చంద్రబాబు స్పందించలేదు. చూసీ చూడనట్టు, సున్నితంగా హెచ్చరిస్తున్నట్టు నెట్టుకొచ్చారు. అయితే, వారిపై తన కమాండ్ పెంచుకోవడానికి చంద్రబాబుకు ఓ అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నల్లధనం చర్చే జరుగుతోంది. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులూ సంపాదనలకు సంబంధించి వివరాలను నిఘా వర్గాల ద్వారా చంద్రబాబు తెప్పించుకుంటున్నట్టు సమాచారం! అధికారం అడ్డుపెట్టుకుని నాయకులు పెద్ద ఎత్తున అక్రమ సంపాదనలకు పాల్పడుతున్నట్టు మొదట్నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఆ సంపాదనలు ఏ స్థాయిలో ఏయే మార్గాల ద్వారా వచ్చాయో చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా..? తెలిసినా కూడా ఇన్నాళ్లూ ఎవ్వర్నీ ఏమీ అనలేని పరిస్థితి! అయితే, పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ వివరాలను తన దగ్గరకు రప్పించుకుంటున్నారట. ఆ వివరాలే చంద్రబాబు చేతిలో బ్రహ్మాస్త్రంగా మారబోతుందని చెప్పాలి.
తమ ఆదాయ వివరాలూ, ఆస్తుల వివరాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయన్న పక్క బెదురు నాయకులకు ఉంటుంది కదా! పార్టీలో కీలక శక్తులు అని చెప్పుకునేవారిలో కూడా ఈ టెన్షన్ ఎక్కడో చోట కచ్చితంగా ఉండి తీరుతుంది. సో… సహజంగానే చంద్రబాబు నాయకత్వానికి మరింత తలొగ్గి ఉండాల్సిన పరిస్థితి సహజంగానే వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇదే వ్యూహంతోనే సదరు వివరాలను నిఘా వర్గాల నుంచి తెప్పించుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కేంద్రం నిర్ణయాన్ని తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా భలేగా మార్చుకున్నారు కదా!