పవన్ కల్యాణ్ : తెలుగు భాష ఎంత గొప్ప సంపదో వీళ్ళకు తెలుసా..?

పసి పిల్లల నోటి నుంచి వచ్చే తొలి పలుకు “అమ్మ”. అమ్మ భాష అమృతంతో సమానం. అంతటి భాషను మార్కెట్ అవసరాలతో ఎలా తూకం వేస్తారు? మాతృ భాష విలువను గణించే తూకం రాళ్ళు ఉన్నాయా?. తెలుగు భాషను పాశ్చాత్యులే “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని కీర్తిస్తే .. తెలుగు నాయకులు మాత్రం ఇప్పుడేం ఉపయోగం అనడం ఏమిటి..? ఉత్కృష్టమైన తెలుగు భాషను పసి వయసు నుంచే పిల్లలకు దూరం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఎందుకు..?

అధికార భాషా సంఘం ఏం చేస్తోంది?

ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయం… నా లైబ్రరీలోని తెలుగు పుస్తకాలను అపురూపంగా ఎంతో ప్రేమతో చూసుకునేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని భావితరాలకు “అ… ఆ… ఇ… ఈ..” అని ఓనమాలు దిద్దించే పరిస్థితులు క్రమంగా కనుమరుగు కావడమే కాదు… ఘనమైన తెలుగు సాహిత్యం అనేది ఏమైపోతుంది..? తెలుగు భాష నిజంగా ఎలాంటి సంపద అనేది వైసీపీ నాయకత్వం సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే గనుక.. వారు ఇలాంటి ఆటవికమైన నిర్ణయం తీసుకుని ఉండేవారే కాదు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం తొలగించేవారే కాదు. పసిప్రాయం నుంచే అమ్మ భాషకు దూరం చేసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయంపై అధికార భాషా సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదు..? ” తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలలో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తోంది?. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు గతంలో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించారు కదా..? తెలుగు భాష అభివృద్దికి దోహద పరిచేలా సంఘం ఉండాలి. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎనిమిది సంపుటాలు ఇప్పుడు లభించడం లేదు. నేను అతి ప్రయాసపై ఎనిమిది సంపుటాలనూ సేకరించాను. అలాంటి నిఘంటువులను అధికార భాషా సంఘం ముద్రించాలి. తెలంగాణలో సాంస్కృతిక శాఖ చేసిన ప్రచురణలను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష కోసం తమ సాంస్కృతిక శాఖ ద్వారా చేపట్టిన చర్యలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ట్వీట్లు చేశారు. అంతేకాదు జగన్ పత్రిక సాక్షి గత ప్రభుత్వం కొన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన విమర్శలు చేసి తప్పుబట్టిందో కూడా చూపారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు ..?

మౌనంగా భరిస్తే నష్టమే ..!

భావితరాలకు నష్టం కలిగించే చర్యలను ముందుగానే పసిగట్టినా మౌనంగా స్వీకరిస్తే ఎలా ..? ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అమ్మ భాషను దూరం చేయడమే కాదు ఆంగ్ల భాషను సైతం సక్రమంగా నేర్పాలనే పరిస్థితులు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్నాయి అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ లేకుండా ఆంగ్ల మధ్యమాన్ని తీసుకువస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వారు ఏమి నేర్చుకొంటారు అనేది ముందుగానే గుర్తించాలి. ఇలాంటివి గుర్తించి కూడా భరిస్తే సమాజం ఏమవుతుందో గుర్తించాలి. ” వికృత చర్యలను సమాజం నిశ్శబ్దంగా స్వీకరించినప్పుడే కుళ్లిపోవడం మొదలవుతుంది. ఆ చర్యలపట్ల నిర్ఘాంతపోయే శక్తిని కోల్పోతారు. ఒక మూర్ఖమైన చట్టం తమ ఎదుటకు వచ్చినప్పుడు.. తాము తీసుకువచ్చిన రాక్షసుడి వైపు చూడడం వారు ప్రారంభించరు. ఈ జాతులన్నీ నిజంగా ప్రమాదంలో పడ్డట్టే..” అని “ది మ్యాడ్ అఫీషియల్‌” లో చెస్టర్‌టన్ చెప్పిన మాటలు ఇక్కడ నిజం అవుతున్నాయి.

ఒకసారి ఘన చరిత చూడాలి ..!

అసలు ఈ పాలకులు తెలుగు భాష ఘన చరిత్రను విస్మరించడం వల్లే ఈ ఉత్పాతం వచ్చింది. ఆరో శతాబ్దంలో ఏడు వేల గ్రామాల మండలమైన రేనాడు (ఇప్పటి రాయలసీమ)లోనే తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ దొరికినాయి. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం అప్పటి రేనాడు (ఇప్పటి రాయలసీమలోనే) గ్రామాలే… వైసీపీ నాయకుడు కడప నుంచి వచ్చినవాడే అయినప్పటికీ.. తెలుగు భాషను చిన్న చూపు చూడటం విచారకరం. కడపలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఉంది. 66 వేల తెలుగు పుస్తకాలు ఉన్నాయి. ఒక ఇంగ్లిషు పెద్దాయన మన తెలుగు భాష కోసం ఇంత కృషి చేస్తే… మన తెలుగు నాయకులు తెలుగు భాషను తుడిచిపెట్టేయాలని చూస్తున్నారు. మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నపరుచుకుంటే ఎలా? ఇంగ్లీష్ నేర్పాలి కానీ, విద్యావిధానంలో మాతృభాషని అగౌరపరిచే పద్ధతి మానుకోవాలి. యాసని, సంస్కృతిని అవమానపరిచారు అంటేనే -తెలంగాణ విడిపోయింది, మరి మాతృ భాషని అగౌరపరిచి, ఉనికిని చంపేస్తానంటే ఏం జరుగుతుందో నాయకులూ ఊహించగలరా? పాలక పక్షానికి ఒక హెచ్చరిక ఇచ్చారు. కన్నడిగులు, మరాఠీలు, తమిళులు మరియు హిందీ మాట్లాడే భారతీయుల నుంచి.. మాతృభాషను కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ఎలాగో మనం నేర్చుకోవాలి.

నాయకులు, మేధావులకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీ అభిప్రాయాలు అనేవి అంతిమంగా విధానాలుగా రూపుదిద్దుకుంటాయి. అవి రాబోయే తరాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, మీరు మాట్లాడే ముందు ఒకటిరెండుసార్లు ఆలోచించుకోవాల్సిందిగా వేడుకుంటున్నా. మాతృభాష విషయంలో భాషా శాస్త్రవేత్తలు, పండితులు, మేధావులు మౌనాన్ని ఆశ్రయిస్తే భావి తరాలకు అమ్మ భాషను దూరం చేసినవారిమవుతాం. కొన్ని దశాబ్దాల తరవాత పసివారి నోటి నుంచే వచ్చే తొలి పలుకు “మమ్మీ” అయితే..? ఈ ఊహే మనసుని మెలిపెడుతుంది. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` అలాంటి క‌న్‌ఫ్యూజ్...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

HOT NEWS

[X] Close
[X] Close