మొత్తం మీద పల్లకీల మోత!

భూగోళం మీద కాలుష్యాలకు ప్రధాన కారకులైన చైనా, అమెరికా దేశాలే కాలుష్యాల నివారణ బాధ్యతలు కూడా స్వీకరించాలని ఐఖ్యరాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ దృఢమైన స్వరంతో నిస్సంకోచంగా ప్రకటించారని బిబిసి టివి ప్రస్తుతించింది. అలాగే భారత దేశంతో పాటు సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌లను కూడగట్టి ఇదేపర్యటనలో న్యూయార్క్ లో జీ-4 శిఖరాగ్ర సదస్సు నిర్వహించిన మోదీ చొరవను ప్రశంసిచారు. భద్రతామండలిని అర్ధవంతమైన రీతిలో సంస్కరించాలనీ, విస్తృతపరచాలనీ కోరుతూ ఈ సదస్సు ఒక తీర్మానం చేసింది. శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనాలు ప్రస్తుత స్థితిని మార్చడానికి అనుకూలంగా లేవు. చైనాను అటుంచితే మిగతా నాలుగు దేశాలూ భారత్‌కు ఇంతవరకూ మాటల్లో తప్ప చేతల్లో సాయపడింది లేదు. తమకూ చోటుకావాలని కోరుతున్న జీ4 కోసం భద్రతామండలిని సంస్కరించడం వల్ల మరో నాలుగు దేశాలకు వీటో అధికారాన్ని పంచడం తప్ప ఇప్పటికే శాశ్వత సభ్యులుగా వున్న ఐదుదేశాలకూ ఏ ప్రయోజనమూ లేదు. ఇందువల్ల జి4 కోరికలు తీర్మానం అమలయ్యే అవకాశంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈతీర్మానం అవాస్తవిక అంచనాలమీద చేసిన ప్రయత్నమని విదేశాంగశాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా భారత్‌ వంటి 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి భద్రతామండలిలో శాశ్వత స్థానం ఇవ్వవలసిందేనన్న సంకేతాన్ని మోదీ ప్రపంచానికి దృఢంగా సూచించారనిపిస్తోంది. అమెరికా కాంట్రాక్టులు దక్కించుకోవడం మీద అమెరికాకు వున్న ఆసక్తి పెట్టుబడులు పెట్టడం మీద వుండదు. అమెరికా పర్యటనకు ముందు భారత ప్రభుత్వం సైనిక హెలికాప్టర్లకోసం బోయింగ్‌ కంపెనీకి హెలికాప్టర్ల సరఫరాకు మూడు బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును క్లియర్ చేసింది. అయితే పెట్టుబడులపై పెద్దగా స్పష్టమైన కమిట్మెంట్లను మోదీ తీసుకురాలేకపోయారు. మోదీ అమెరికాలో, అమెరికన్‌ కార్పొరేట్‌ దిగ్గజాలతో, సిలికాన్‌ వ్యాలీ అధినేతలతో సమావేశాలు జరిపి భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. . కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ సెంటర్‌లో తమ ప్రభుత్వ విజయాలనూ, గత పాలకుల వైఫల్యాలనూ ఏకరువుపెడుతూ భారతీయ అమెరికన్లను ఉర్రూతలూగించారు.

స్వయంగా ఒక టెకీ కాకపోయినా , దానిపట్ల నరేంద్రమోదీకి ఉన్న అభిమానాన్నీ, అంకితభావాన్నీ సిలికాన్‌వ్యాలీ అర్థం చేసుకున్నదని భావించవచ్చు. ఫార్చూన్‌ 500 జాబితాలో ఉన్న నలభైరెండు కంపెనీల సీఈవోలతో భేటీ అయినప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా భారత్‌ ఏ విధంగా మారుతున్నదీ మోదీ వివరించి చెప్పారు. ముఖ్యంగా, డిజిటల్‌ ప్రపంచ శాసనకర్తగా ఉన్న సిలికాన్‌ వ్యాలీలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ సంస్థల సీఈవోలతో ఆయన జరిపిన భేటీలు తనతో పాటుగా, భారత్‌ను కూడా ప్రపంచానికి మరోమారు పరిచయం చేసినట్టే అనిపించాయి.. డిజిటల్‌ విప్లవంతో సకల సమస్యలూ తొలగిపోతాయని విశ్వసిస్తున్న నరేంద్రమోదీ సిలికాన్‌వ్యాలీలో మూడు దశాబ్దాల అనంతరం అడుగుపెట్టిన తొలి ప్రధాని కావడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. పైగా, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలకు అత్యున్నతస్థానాల్లో భారతీయులే ఉన్నప్పుడు ఈ పర్యటన ప్రభావం వృధాగా పోదని ఆశించవచ్చు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ‘రెడ్‌ టేప్‌’ స్థానంలో ‘రెడ్‌ కార్పెట్‌’ వచ్చిన విషయాన్ని ఏకరువుపెట్టారు.

పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని స్వయంగా ప్రధానే ప్రతి కార్పొరేట్‌ ముందుకీ వెళ్ళి పదేపదే చెప్పడం కంటే, మౌలిక సదుపాయాల ఏర్పాటు మీద దృష్టిసారించి, బలమైన భారత్‌ను తయారుచేసుకుంటే పెట్టుబడులు సహజంగానే వస్తాయి. లేకపోతే ఈ తరహాలోనే పెట్టుబడులు సమీకరించాలనుకుంటే కంపెనీల షరతులు పెరిగిపోతూంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com