అరంకోతో అవగాహనే లేదు, తరలింపా?

ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హౌదా ఇవ్వాలనీ నిధులు మంజూరు చేయాలని తీవ్ర ఉద్యమాలు విమర్శలు నడుస్తున్నాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా ఖండించదగింది. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందుకు వంతపాడినా ప్రథమ బాధ్యత కేంద్రానిదేననడంలో సందేహం లేదు. అయితే అదే సమయంలో అనేక అవాస్తవాలు అతిశయాలు కూడా చలామణిలోకి వస్తున్నాయి. టిడిపి వైఖరి మారగానే దాన్ని బలపర్చే కొన్ని మీడియా సంస్థలు కూడా పల్లవి మార్చాయి. విభజన చట్టం ప్రకారం కాకినాడలో నెలకొల్పవలసిన చమురుశుద్ధి కర్మాగారం కోసం చంద్రబాబు సౌదీ అరేబియాకు చెందిన అరంకో సంస్థను ఒప్పించగా కేంద్రం దాన్ని మహారాష్ట్రలోని రత్నగిరికి తరలించిందనేది ఇప్పుడు బాగానడుస్తున్న వివాదం. కాకినాడకు రావలసిన కాంప్లెక్స్‌ను ఇవ్వకపోవడం అన్యాయమే. హెచ్‌పిసిఎల్‌, గెయిల్‌ వంటి అనేక చమురు సహజవాయు సంస్థలతో ముడిపడిన సమస్య ఇది. కాకినాడలో కాంప్లెక్స్‌ పెట్టాలంటే ఆర్థిక నష్టం భరించేందుకు రాష్ట్రం దాదాపు 5700 కోట్లు పరిహారం ఇవ్వాలని కేంద్ర సంస్థలు అంటున్నాయి. ఇప్పటికే లోటులో వుంటే ఇంత మొత్తం ఎలా ఇవ్వగలమని రాష్ట్రం వాపోతున్నది. తాజాగా హౌదా వివాదం మొదలైన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసి జెఎఫ్‌సికి అందించిన నివేదికలోనూ ఇదే వుంది.

రాజస్థాన్‌లోని బమిడాలో ఇలాటి సంస్థనే ఏర్పాటు చేయడానికి కేంద్రం రు.3700 కోట్లు సహాయం చేసిందనీ మరి లోటుతో వున్న ఎపికి కూడా ఎందుకు ఇవ్వడంలేదని ఆ నివేదిక ప్రశ్నిస్తున్నది. ఇలాటి సందర్భాల్లో మామూలుగా ఆర్థిక భర్తీ అంటారు గాని ఇక్కడ ద్రవ్యభర్తీ అని మరింత బరువైన దృక్పథం తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని ఎపి వాదన.

ఈ మధ్య కాలంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటన సందర్భంగా 2017లోనూ, 2018లోనూ కూడా అరంకో ఉపాద్యక్షుడు హమ్‌దరీతో సమావేశమైన మాట నిజమే కాని ఎలాటి సంతకాలు జరిగింది లేదు. బంగాళాఖాతం తీరంలో అవకాశాలు చమురు సహజవాయు సంపదల గురించి ఆసక్తిచూపిన అరంకో తమ ప్రతినిధులను పరిశీలనకు పంపిస్తామని చెప్పిందని మాత్రమే నాటి అధికార నివేదికచెబుతున్నది. అంతేగాని అంగీకారం దాదాపు కుదిరిందనే మాటేలేదు. ఆ మాటకొస్తే పైన చెప్పిన తాజా నివేదికలోనూ ఈ మాట లేదు.

ఇక కేంద్ర చమురు శాఖా మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ అరంకోతో రత్నగిరిలో 1.88 లక్షల కోట్ట చమురు శుద్ధి కర్మాగారం కోసం ఒప్పందం ప్రకటిస్తూనే కాకినాడలో రు.33 వేల కోట్ల విలువైన కాంప్లెక్స్‌ పట్ట కూడా ఆసక్తితో వున్నట్టు 2018 ఫిబ్రవరిలోనే వెల్లడించారు. అరంకో ఆసక్తిని పునరుద్ఘాటిస్తూనే వుంది కూడా. కనుక కేంద్రం దీన్నివేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలి. ఏ ఒప్పందం లేకుండానే అంతా పూర్తి కావచ్చినట్టు హడావుడి చేసిన ఎపి ప్రభుత్వం అదేదో రత్నగిరికి తరలిపోయినట్టు రాజకీయ ప్రచారం చేసేబదులు రాష్ట్రానికి రావలసింది తెచ్చుకోవడంపై దృష్టి పెడితే మంచిది.ఈ విషయంలో పర్యావరణ సమస్యలు కూడా పరిష్కరించుకోవలసి వుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com