సంఘి బ్రదర్స్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. కానీ తర్వాత కుటుంబ పంచాయతీలతో కిందపడిపోయారు. ఇప్పుడు ఆ బ్రదర్స్ లో ఒకరైన రవి సంఘి ఇన్వెస్టర్స్ ను మోసం చేసి కంపెనీ ఆస్తులను బినామీగా మార్చుకున్న విషయాన్ని ఐటీ గుర్తించి జప్తు చేసింది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ, ఒమర్ ఖాన్ దాయిరా గ్రామాల్లోని 282 ఎకరాల భూమిని ఐటీ శాఖ బినామీ నిరోధక విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల ధర సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ 282 ఎకరాల భూమిని బినామీ ఆస్తిగా నిర్ధారిస్తూ 17 ప్రోవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్లను జారీ చేసింది. ఈ భూములను సంఘీ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్లు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బినామీల పేరిట మళ్లించినట్లు ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది.
ఐటీ శాఖ దర్యాప్తు ప్రకారం.. ఈ భూ లావాదేవీల్లో సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , ఇన్కార్ రియల్టీ ప్రాజెక్ట్స్, వెంకటేశ్వర రియల్టీ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఇన్కార్ రియల్టీ సంస్థను కేవలం ఒక బినామీదారుగా గుర్తించారు. రవి సంఘీ , ఆయన కుటుంబ సభ్యులు వివిధ ట్రస్టులు, భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ భూములపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సంఘీ ఇండస్ట్రీస్‌ను మరో పెద్ద సంస్థ కొనుగోలు చేయడానికి ముందే, కంపెనీకి చెందిన విలువైన భూములను తక్కువ ధరకు తమ సొంత సంస్థలకు మళ్లించాలని ప్రమోటర్లు పథకం వేసి అమలు చేశారు.
సెబీ నిబంధనల ప్రకారం.. కంపెనీ టర్నోవర్‌లో 10 శాతం కంటే ఎక్కువ విలువైన ఆస్తులను విక్రయించాలంటే షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి. దీన్ని తప్పించుకోవడానికి కేవలం రూ. 84 కోట్లుగా భూమి విలువను చూపించి ఇన్కార్ రియల్టీకి అమ్మేశారు. సంఘీ ఇండస్ట్రీస్‌లో తమ వాటాలను అమ్ముకోగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని తిరిగి తమకే చెందిన వెంకటేశ్వర రియల్టర్స్ లోకి పెట్టుబడిగా తెచ్చారు. అదే రోజు ఆ నిధులను ఇన్కార్ రియల్టీకి పంపి, అక్కడి నుండి సంఘీ ఇండస్ట్రీస్‌కు చెల్లింపులు జరిగినట్లు చూపారు.
కంపెనీ మేనేజ్మెంట్ నుండి తప్పుకున్నాక, భూముల విలువను రూ.218 కోట్లకు పెంచుతూ రెక్టిఫికేషన్ డీడ్లు చేశారు. ఈ ప్రక్రియ కోసం మార్ఫింగ్ చేసిన ఫోటోలు, 2024లో తయారు చేసి 2023 నాటివిగా చూపిన ఫోర్జరీ వాల్యుయేషన్ రిపోర్టులను వాడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. సాధారణ ఇన్వెస్టర్లను, మైనారిటీ షేర్ హోల్డర్లను మోసం చేస్తూ కంపెనీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశమని ఐటీ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ 282 ఎకరాల భూమిపై ఎటువంటి విక్రయాలు లేదా నిర్మాణాలు జరగకుండా ఐటీ శాఖ అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం రియల్ ఎస్టేట్ మరియు కార్పొరేట్ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది.
