ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరుగులు పెడుతుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ భారీ ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. డేటా సెంటర్లు, రిఫైనరీలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని .. అదే ప్రయోజనం అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరిశ్రమలు ఎప్పుడైతే ఏపీలో ఖర్చు పెట్టడం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.
పెట్టుబడుల్లో పన్నుల రూపంలో 30 శాతం ప్రభుత్వానికి !
ఓ సంస్థ పదివేల కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఏటా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్లాంట్ నిర్మాణం ..ముడిసరుకులు కొనుగోలు చేస్తుంది. ఆ ఖర్చులో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇలా దాదాపుగా పెట్టుబడుల కోసం కంపెనీలు పెట్టే ఖర్చులో 30 శాతం వరకూ ఏపీకి ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పెట్టుబడి వల్ల ఏపీకి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
అందుకే కొంత ప్రోత్సాహకాలు
పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించడానికి రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఆ కంపెనీల వల్ల వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకుని.. దానిలో కొంత మొత్తం వారికి రాయితీలు ఇస్తాయి. అంతే కానీ ప్రభుత్వం సొంతంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఆ ప్రోత్సాహాకాలు వారికి నచ్చితే పెట్టుబడులు పెడతారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాల విషయంలో పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పారిశ్రామికంగా లాంఛింగ్ అవసరం. అలాంటి లాంఛింగ్ ఈ ప్రోత్సాహకాల వల్ల వస్తుంది. ఆ తర్వాత కంపెనీలు క్యూకడతాయి.
ఆదాయం ఒక్క సారితో ఆగేది కాదు !
పెట్టుబడులు వచ్చి కంపెనీలు ఏర్పాటు అవడం వల్ల నిరంతరం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కియా పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే..కొన్ని వందల రెట్ల ఆదాయం ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో వస్తోంది. జీఎస్టీలు… ఇతర పన్నులను కియా కడుతుంది. అలాగే ప్రతి పరిశ్రమ ఉత్పత్తులపై పన్నులు కట్టాల్సిందే. అంటే.. ఆ సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉత్పత్తులు ప్రారంభించి ప్రపంచం మొత్తం అమ్ముకుంటే.. ఆదాయం ఏపీకి కూడా వస్తుంది. అంటే ఒక్క పరిశ్రమ వస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ అన్నమాట. భవిష్యత్ కు భరోసా. చంద్రబాబు,లోకేష్ అదే ప్రయత్నం చేస్తున్నారు.